రాయచోటి : పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏ మాత్రం ఆర్థిక భారం కాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని జిల్లా బీసీ సంక్షేమ శాఖ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సందప్ప, జాకీర్ హుస్సేన్లు సంయుక్తంగా పేర్కొన్నారు .ఆదివారం ఎన్‌టిఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2022- 23 విద్యా సంవత్సరానికి సంబంధించి 'జగనన్న విద్యా దీవెన' లబ్ది మొత్తాన్ని ల్యాప్ టాప్ బటన్ నొక్కి అర్హులయిన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేశారు. కార్యక్రమానికి కలెక్టరేట్ విసి హాలు నుంచి జిల్లా బీసీ సంక్షేమ శాఖ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 35,656 మంది విద్యార్థులకు మంజూరైన లబ్ది మొత్తం రూ. 23.62 కోట్ల మెగా చెక్కును విద్యార్థులు, వారి తల్లులకు మీదుగా అందజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి స్థాయి ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం సంతోషకరమన్నారు. నిరుపేద విద్యార్థులకు సైతం ఉన్నత స్థాయి చదువులను చదివే అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు లబ్ది పొందిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా రాష్ట్రంలో ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, ఆపై స్థాయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికీ ముఖ్యమంత్రి అందిస్తున్న సువర్ణావకాశం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య దీవెన సాయం అందుకుని చదువుపై ఏకాగ్రతతో భవిష్యత్ లక్ష్యం పైపు అడుగులేయాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మైనారిటీస్ శాఖ, విద్యాశాఖ అధికారులు, జిల్లాలోని పలు డిగ్రీ, ఇంజినీరింగ్ ఇతర ప్రొఫైషనల్ కోర్సుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.










