పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : తూర్పు రాయలసీమ (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) శాసనమండలి ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లు రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలను గెలిపించాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి పి.యస్థానిబాషా ఓటర్లను కోరారు. ఈ మేరకు శనివారం ఆత్మకూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న, గాయత్రి స్కూల్, టెంకాయ తోపులో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఉపాధ్యాయులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలలో తమ అభ్యర్థులకు ఓట్లు వేసి విజయం చేకూర్చాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. పోరాట పటిమ కలిగిన వెంకటేశ్వర్లు రెడ్డి, బాబురెడ్డిలను గెలిపిస్తే శాసనమండలలో ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కారానికి గళం వినిపించి రాజీలేని పోరాటాలు సాగిస్తారని వారు ఓటర్లకు వివరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న ఆయా వర్గాల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి న్యాయమైన కోర్కెల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో 7వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎమ్‌డి సాలారుద్దీన్, 7వ వార్డు ఆవాజ్ కమిటీ సభ్యులు సర్దార్, షేక్.ఖాజా రహమతుల్లా, పి.అఫ్రీద్, తదితరులు పాల్గొన్నారు.










