ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో, అధికారులు అప్రమత్తమై మిగులు జలాలను ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఈ బ్యారేజీలో శనివారం సాయంత్రం ఆరు గంటలకు 8.45 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీ 54 గేట్ల ద్వారా 1,51,614 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు సాగునీటి అవసరాల కోసం పది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరం పాత బ్రిడ్జి వద్ద 13.260 మీటర్లు, పోలవరం వద్ద 7.240 మీటర్లు, భద్రాచలం వద్ద 16.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 1.37 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి, 8,200 క్యూసెక్కులు కాలువకు, గురువారం 1.03 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి, 7,200 క్యూసెక్కులు కాలవలకు విడుదల చేశారు. గత రెండు రోజుల కంటే శనివారం గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది.










