Jul 03,2021 06:55

    దేశంలో రెండవసారి బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కిన రెండు సంవత్సరాలలో 92 సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచింది. గ్యాసు సిలిండరుపై ఎనిమిది సార్లు పెంచింది. తద్వారా రూ. 2 లక్షల డెబ్భై వేల కోట్ల రాబడి చేసుకుంది. ఈ జనవరి నెల నుండి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 50 సార్లు పెంచి, గ్యాసు సిలిండర్‌ పై ఐదు సార్లు భారం మోపింది. తాజాగా ఈ రోజు నుండి రూ. 25.50 పెంచి డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఆంధ్రప్రదేశ్‌ లోని ముఖ్య పట్టణాలలో రూ. 902, హైదరాబాదులో రూ. 862 చేయనుంది. ప్రభుత్వం విడుదల చేసిన సర్వేల ప్రకారం 73 శాతం ప్రజల సంపద కేవలం 1 శాతం ప్రజలకు చేరుతున్నది. గత పదహారు నెలలుగా సామాన్య ప్రజల ప్రమాణాలు అధోగతి పాలవుతుంటే...అంబానీ, అదానీల లాభం గంటకు రూ.90 కోట్లు ఉంది. కరోనా సమయంలో బడా బాబులు తీసుకున్న అప్పులు రూ.68 వేల కోట్లు రద్దు చేశారు.
     ప్రతి సామాన్య రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్నారేగాని...రైతుకు అందాల్సిన ఇంటరెస్ట్‌ సబ్వెన్షన్‌ రెండు శాతం, ప్రాంప్ట్‌ రీ పేమెంట్‌ ఇన్సెంటివ్‌ ఒక శాతం కూడా ఇవ్వడం లేదు. క్రాప్‌ లాస్‌, బ్యాంకు రుణాల రద్దు, ఇన్సూరెన్స్‌ జమ కావడం లేదు. గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయ పరికరాలు...ట్రాక్టర్లు, గుంటకలు, పవర్‌ స్ప్రేయర్లు, మడకలు, టిల్లర్లు, రోటవేటర్లు తదితర పనిముట్లకు రాయితీ లేదు. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ట్రాక్టరును కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం లేదు. ఇక మైక్రో ఇరిగేషన్‌ ద్వారా డ్రిప్‌ పైపులు, లాడర్‌, డిప్పర్లు, మల్చింగ్‌ షీట్లు, స్ప్రింక్లర్లు ఇవ్వటం లేదు. రైతులకు పొలంబడి, కొత్త వ్యవసాయ వంగడాలు మెళుకువలు చెప్పే నాథుడే లేడు. ఇంకుడు గుంతలు, ఫార్మ్‌ పాండ్‌, ఇంజెక్షన్‌ వెల్స్‌, బొప్పాయి, అరటి , జామ, చీనీ, దానిమ్మ తదితర పంటలకు రుణాలు లేవు. ఆత్మ, నాబార్డ్‌ ఆఫీసులు ఎక్కడున్నాయో రెవెన్యూ అధికారులకే తెలియదు. జిల్లాలలో నాబార్డ్‌ వలన బహుజన సన్నకారు రైతులకు ఒక్కరు కూడా లబ్ధిదారులు లేకపోవడం శోచనీయం. దేశం మొత్తంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన సన్నకారు రైతులను, పారిశ్రామికవేత్తలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. సంపన్న వర్గాలకు కోల్డ్‌ స్టోరేజీలకు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కోట్ల రూపాయలు ఇస్తారు కాని పేద మధ్యతరగతి ప్రజలకు కనీసం లక్ష రూపాయలు ఇవ్వరు. మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మ నిర్భర భారత్‌, గరీబ్‌ కళ్యాణ్‌ యోజన, ప్రధాన మంత్రి కృషి సంచాయని యోజన, వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌, ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌ భారత్‌...ఇలా నోరు తిరగని పథకాలెన్నో వున్నా...కేవలం ప్రకటనలు ఆర్భాటాలే. డీజిల్‌, పెట్రోల్‌ రేట్లు పెంచడంతో వ్యవసాయ అనుబంధ రంగాలు పూర్తిగా దివాళా తీసి ప్రత్యామ్నాయం లేక రైతాంగం తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతోంది.
 

- డా|| యం. సురేష్‌ బాబు,
ప్రజా సైన్సు వేదిక రాష్ట్ర అధ్యక్షులు.