Feb 13,2023 20:56

నీరు

           అనంతపురం ప్రతినిధి: నిత్యం క్షామ ప్రాంతంగా ఉండే అనంతపురం జిల్లాలో వర్షాభావంతో భూగర్భ జలాలు ఎప్పుడూ పాతాళంలోనే ఉండేది. దీని కోసం రైతులు వెయ్యి అడుగుల వరకు బోర్లు వేసినా ప్రయోజనముండేది కాదు. అయితే వాతావరణంలో వచ్చిన మార్పులో ఏమోగానీ గడిచిన మూడు సంవత్సరాలుగా వర్షాలు బాగా పడుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు పైకొచ్చాయి. 20 ఏళ్లలో ఎన్నడూలేనంత పైకి ఈసారి వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో సగటున 5.81 మీటర్ల ఎత్తులో భూగర్భ జలాలు ఉన్నట్టు భూగర్భ జల శాఖ నివేదికలు చెబుతున్నాయి. 2022 నవంబర్‌ అయితే 4.94 మీటర్ల ఎత్తులోనే నీరు ఉండింది. ఇప్పుడు అవి 5.81 మీటర్ల లోతుకు చేరింది. అంతకు మునుపు సంవత్సరం కంటే చూస్తే ఈసారి 3.37 మీటర్ల నీటి మట్టం పెరిగింది.
20 సంవత్సరాల్లో ఇప్పుడు అత్యధికం
2000 సంవత్సరం నుంచి రాష్ట్రంలో భూగర్భ జలాల నీటి మట్టాన్ని పిజియో మీటర్ల ద్వారా కొలుస్తున్నారు. అంతకు మునుపు దిగుడు బావుల్లో నీటి మట్టాలను కొలిచి లెక్క గట్టేవారు. 2000 సంవత్సరం నుంచి పిజియో మీటర్ల ద్వారా బోరు బావుల్లోకి పరికరాలను పంపి నీటిని సాంకేతిక పద్ధతలో లెక్క గట్టడం ప్రారంభమైంది. అప్పటి నుంచి చూస్తే ఉమ్మడి జిల్లాలో మొత్తం 190 ప్రాంతాల్లో లెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో అయితే 97 ప్రాంతాల్లో లెక్కిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి చూసినప్పుడు సగటున ఏటా 11 మీటర్ల నుంచి 22 మీటర్ల లోతున బోరుబావుల్లో నీరు లభించేవి. గడిచిన రెండేళ్లుగా అధిక వర్షాలతో నీరు పైకి రావడంతో భూగర్భ జలాలు ఐదు మీటర్లకు చేరువగా వచ్చాయి. 2019 ఫిబ్రవరిలో అయితే 23.39 మీటరర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. తక్కువ భూగర్భ జలాలున్న సంవత్సరం 20 సంవత్సరాల్లో ఇదే కావడం గమనార్హం.
ఈ ఏడాది వర్షాలకు వచ్చిన నీరు 233.53 టిఎంసిలు

జిల్లాలో ఈఏడాది అధిక వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది అనంతపురం జిల్లాలో 648 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 40 శాతం అధికం. గతేడాది ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది పడిన మొత్తం వర్షాన్ని లెక్కగడితే 233.53 టిఎంసిల నీరు లభించినట్టయిందని భూగర్భ జల శాఖలెక్క గట్టింది. ఇందులో 28.02 టిఎంసిల నీటిని వివిధ స్ట్రక్చర్లలో ఒడిసి పట్టుకోగలిగినట్టు సమాచారం. అంటే 12 శాతం వరకు మాత్రమే నీటిని ఒడిసి పట్ట గలిగారు. తక్కిన నీరు బయటకెళ్లిపోయింది. మొత్తంగా ఈ ఏడాది వర్షాలతో గతంలో ఎన్నడూలేనంతగా భూగర్భ జలాలు పైకి రావడం హర్షణీయం.