Feb 11,2023 22:08

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ :  పారిశుధ్య కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ విమర్శించారు. శనివారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో నగర పంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఫిబ్రవరి 10 నుండి 15వ తేదీ వరకు స్థానికంగా నగరపంచాయతీ పాలకవర్గాలు ,అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సామూహిక రాయబారాలు నిర్వహిస్తామన్నారు. 16న నగర పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామన్నారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, నాయకులు వజ్రం నాగప్ప, నగర కార్మికుల యూనియన్‌ నాయకులు చిన్న వెంకటేష్‌ , వెంకటేష్‌, తిప్పన్న, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.