- ముడిసరుకు, ప్యాకింగ్ మెటీరియల్‌పై పన్ను మోత
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : జిఎస్‌టి ప్రభావంతో మార్కెట్‌లో వివిధ రకాల వస్తువుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండగా తాజాగా సామాన్యుల నుంచి ధనికుల వరకు తప్పనిసరిగా వినియోగించే పాదరక్షలు, బూట్లు, ఇతర వస్తువుల ధరలు వచ్చే జనవరి నుంచి గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం వీటిపై ఉన్న ఐదు జిఎస్‌టిని 12 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రస్తుతం విక్రయించే చెప్పులు, బూట్లు, ఇతర వస్తువుల ధరలు ఒకేసారి ఏడు శాతం వరకు పెరగనున్నాయి. చెప్పులు, బూట్లు తయారీకి ఉపయోగించే రా మెటిరీయల్‌తో పాటు వీటిని ప్యాకింగ్ చేసి ఆయా కంపెనీలు రిటైల్ దుకాణాలకు పంపేందుకు వినియోగించే అట్టపెట్టెల మెటీరియల్‌లపై కూడా 12 శాతం జిఎస్‌టి వసూలు చేయనున్నారు. దీంతో, చెప్పుల తయారీ కంపెనీలు ఇకమీదల వెయ్యి రూపాయలలోపు చెప్పులు, బూట్ల ప్యాకింగ్ మెటీరియల్ వినియోగంపై పొదుపు పాటించనున్నాయి. రూ.వెయ్యిలోపు ఉండే వస్తువులను క్యారీ బ్యాగ్ వేసి ఇవ్వక తప్పదని పలువురు రిటైల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో 300 మంది తయారీదారులు ఉన్నారు. ఏటా సుమారు రూ.3,000 కోట్ల విలువైన చెప్పులు, బూట్ల తయారు చేస్తున్నారు. 15 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద 700 మంది హోల్‌సేల్ వ్యాపారులు ఉన్నారు. ఏడు వేలకుపైగా రిటైల్ షాపులు ఉన్నాయి. రిటైల్ దుకాణాల్లో 15 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అతి సామాన్యులు వినియోగించే చెప్పుల ధరలు సైతం ఇక మీదట సగటున రూ.50 నుంచి రూ.150 వరకు పెరగనున్నాయి. ఇప్పటికే కనీసం రూ.500 చెల్లిస్తే కానీ చెప్పులు దొరకని పరిస్థితి ఉంది. లెదర్ చెప్పుల కనీస ధర రూ.650 నుంచి రూ.750 వరకు ధర ఉంటోంది. వీటిల్లో గరిష్టంగా లెదర్ చెప్పుల ధర రూ.3 వేల వరకు పలుకుతోంది. నేరుగా షాపుల్లో జిఎస్‌టి వసూలు చేయకపోయినా తయారీ కంపెనీలే ధరలు పెంచి పంపుతాయని రిటైల్ వ్యాపారులు తెలిపారు. జిఎస్‌టి అమలులోకి రాకముందు, అమలులోకి వచ్చిన తరువాత రా మెటిరీయల్ ధరల్లో భారీగా పెరుగుదల ఉందని, దీనివల్ల గత ఐదేళ్లలో చెప్పులు, బూట్లు ధరలు రెట్టింపు అయ్యాయని హోల్‌సేల్ వ్యాపారి ఒకరు తెలిపారు. 2018లో రూ.500 నుంచి రూ.600కి లభించే బూట్లు ఇప్పుడు రూ.2 వేల వరకు పెరిగాయి. జిఎస్‌టి అమలుతో పాటు అన్ని రకాల రా మెటీరియల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్ల ఎంఆర్‌పి భారీగా పెంచి వీటిపై ముద్రిస్తున్నారని తెలిపారు.
వ్యాపారం దెబ్బతింటుంది
జిఎస్‌టి పెంపుతో చెప్పుల వ్యాపారం దెబ్బతింటుంది. వెయ్యి రూపాయలలోపున్న పాదరక్షలకు జిఎస్‌టి 12 శాతం పెంచడంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బంది పడతారు. వ్యాపారుల్లో అధిక శాతం మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. జిఎస్‌టి పెంపు వల్ల వ్యాపారం జరగక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. జిఎస్‌టి పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కుని కోవాలి. ప్రస్తుతం మాదిరిగానే ఐదు శాతం జిఎస్‌టినే కొనసాగించాలి.

- రోలా రామారావు, షూ మార్ట్ యజమాని, వినుకొండ.
అంతిమంగా వినియోగదారులపైనే భారం
చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ తప్పనిసరిగా పాదరక్షలు ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం చెప్పులు, బూట్లపై జిఎస్‌టిని ఐదు శాతం నుంచి 12 శాతానికి పెంచడం వల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుంది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల చెప్పులు, బూట్ల ధరలు ప్రస్తుతం ఎక్కువగానే ఉన్నాయి. జిఎస్‌టి పెంపు వల్ల వాటి ధరలు మరో ఏడు శాతం పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో అంతిమంగా వినియోగదారులపై భారం పడుతుంది.

- పెద్దిశెట్టి చరణ్, వినుకొండ.










