- త్రిశంకు స్వర్గంలో విద్యార్థుల భవిష్యత్తు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా 292 బాలికల జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసి పాఠశాల విద్యాశాఖ చేతులు దులుపుకుంది. ఈ కళాశాలల్లోకి కావాల్సిన అధ్యాపకులను, కొత్త భవనాలు, తరగతి గదులను పట్టించుకోకుండా వదిలేసింది. లెక్చరర్ల భర్తీకి, ఉపాధ్యాయుల ప్రమోషన్లకు పాఠశాల విద్యాశాఖ ముడిపెట్టడంతో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల పరిస్థితి అయోమయంగా నెలకొంది. ఇందులో కొనసాగాలా? వద్దా అనే గందరగోళంలో విద్యార్థులు ఉన్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ప్లస్ టు విధానాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది. మండలానికో బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో 292 ఉన్నత పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ అప్‌గ్రేడ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. 54 కళాశాలల్లో ఒక్కరూ చేరలేదు. 118 కళాశాలల్లో 10 మందిలోపే ఉన్నారు. 48 కళాశాలల్లో 20లోపు ఉన్నారు.
అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఎ)లను ఉద్యోగోన్నతుల ద్వారా ఈ కళాశాలల్లో లెక్చరర్లుగా నియమిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఉద్యోగోన్నతులపై ఎటువంటి నిర్ణయాన్నీ తేల్చలేదు. దీంతో కళాశాలల్లో లెక్చరర్లు లేకుండా ఎస్‌ఎలతోనే అరొకరగా విద్యాశాఖ బోధన చేయిస్తోంది. కొన్ని కళాశాలల్లో తెలుగు, మ్యాథ్స్ బోధించే వారుంటే, మరో చోట కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌కు బోధకులు మాత్రమే ఉన్నారు.
అడ్మిషన్లు కూడా ఇంటర్‌లోని అన్ని గ్రూపులకూ విద్యాశాఖ అవకాశం ఇవ్వలేదు. ఒక్కో గ్రూపులో 20 మంది విద్యార్థులు ఉండాలని హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాఠశాలల్లో అర్హులైన సిబ్బందితో కేవలం ఒక గ్రూపునకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులోని ఉన్నత పాఠశాలలో ప్లస్‌టు విధానాన్ని విద్యాశాఖ ప్రారంభించింది. 35 మంది విద్యార్థులు ఇందులో అడ్మిషన్లు పొందారు. సిబ్బంది లేరని 10 మంది ప్రైవేట్ కళాశాలల్లో చేరారు. మిగిలిన వారిలో 20 మంది ఎంపిసి, ఐదుగురు బైపిసిలో అడ్మిషన్లు పొందారు. బైపిసి బోధించేందుకు లెక్చరర్లు లేరని ఎంపిసిలోకి మారాలని పాఠశాల సిబ్బంది చెప్పడంతో ఆ ఐదుగురు కూడా ప్రైవేట్ కళాశాలల్లో చేరారు. మిగిలిన 20 మందికి ఎంపిసిలో బోధన జరుగుతోంది. ఇక్కడ మ్యాథ్స్‌కు అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్ లేకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు సొంత డబ్బులతో బయటి నుంచి లెక్చరర్‌ను నియమించారు. కొత్తగా ప్రారంభించిన అన్ని కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. లెక్చరర్లు లేకపోవడంతో తాము కూడా వెళ్తామని మిగిలిన విద్యార్థులు కూడా టిసిలు అడుగుతుంటే కొన్ని రోజులు వేచి ఉండాలని హెచ్‌ఎంలు వారికి సర్దిచెబుతున్నారు. విద్యార్థుల అడ్మిషన్లను కూడా ఇంతవరకు ఆన్‌లైన్ చేయకపోవడం గమనార్హం. మరోపక్క ఈ నెల 10తో అడ్మిషన్లకు తుది గడువని ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు ఇవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- సౌకర్యాలు కల్పనలో విఫలం
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమే. అయితే ఈ కళాశాలలపై పాఠశాల విద్యాశాఖ ప్రచారం చేయడం, సిబ్బందిని నియమించడం, కొత్త భవనాలు నిర్మించడం వంటి వాటిపై శ్రద్ధ పెట్టలేదు. కొత్తగా 884 జూనియర్ కళాశాలలను ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బత్స సత్యనారాయణ జూన్ 22న ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమంలో వెల్లడించారు. పది రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సిబ్బందిని ఎలా నియమిస్తారని ప్రశ్నించిన విలేకరులతో మంత్రి చులకనగా మాట్లాడారు. లెక్చరర్లు, తరగతి గదులు లేకుండానే అడ్మిషన్లు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ జూన్ చివరిలో ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో కొన్ని రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన బాలికలకు టిసిలు కూడా ఇవ్వలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో వారికి టిసిలు ఇచ్చారు.










