ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో అన్నదాతలు తీవ్రంగా నష్ట పోయారని బిసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం ఈ అంశంపై స్థానిక నీరుగట్టువారిపల్లెలోని బిసిహెచ్‌పిఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలపై పంట నష్టం సర్వే నివేదికలు ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకోవడం జరుగలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఆక్షేపించారు. వడగండ్లు, అకాల వర్షాల వలన దెబ్బ తిన్న రైతులకు న్యాయం చేసే విధంగా, క్షేత్రస్థాయి పరిశీలనలో వెంటనే ప్రభుత్వం అంచనాలు తయారు చేసి, బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బిసి సామాజిక వర్గం వడ్డెర కులానికి చెందిన డిఎస్‌పి వేణుగోపాల్‌పై వెంటనే విఆర్‌ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులపెద్దలు ఏర్పాటు చేసిన సమావేశానికి డిఎస్‌పిని పిలవడం జరిగిందని, దీనికి రాజకీయాలు జోడించి అతన్ని విఆర్‌లో పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. బిసి ఓట్లు కావాలి, అదే బిసిలు వారి కుల పెద్దలతో కలవకూడదా, ఇది సరైన పద్దతి కాదన్నారు. వెంటనే డిఎస్‌పిని విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో నేరుగా డిజిపి, ముఖ్యమంత్రిని కలసి సమస్యను వారి దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిసిహెచ్‌పిఎస్ నాయకులు చంద్రయ్య, రామ లింగయ్య, బండి రామచంద్ర, సుబ్రమణ్యం, రమణ, శ్రీనివాసులు, రఘునాధ్, రఘు, సుబ్బయ్య, గురుమూర్తి, వేణు గోపాల్ పాల్గొన్నారు.










