ఇప్పటికీి కేంద్రంలోని వివిధ శాఖల్లో 24 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మోడీ వాటిని భర్తీ చేసి దేశభక్తి చాటుకోవాలి. పైగా ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా సహాయం, 11 రకాల విద్యాసంస్థలు, రెవెన్యూ లోటు...వంటి హామీలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి చేసిన నమ్మక ద్రోహం వలన నిరుద్యోగ యువతకు తీరని నష్టం జరిగింది. 'నేను అధికారంలోకి వస్తే ఒకేసారి 2 లక్షల 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాన'ంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపిన జగన్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమల్‌నాథన్ కమిటీ రిపోర్టు ప్రకారం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు సాధికారత సర్వే నిర్వహించి 34 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు లెక్కలు వేశారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. నిరుద్యోగుల సంఖ్య నేటికి మరింత పెరిగింది. కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు రోజు రోజుకు మూతపడుతున్నయి. దీనికి కరోనా తోడై యువత పరిస్థితిని మరింత దయనీయంగా మార్చింది.
మోడీ బాట లోనే జగన్
నరేంద్ర మోడీ ప్రపంచంలోకెల్లా అత్యధిక నిరుద్యోగం వున్న దేశంగా భారత్‌ను నిలబెట్టారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాత్రం దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేసే పనిలో ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికీి కేంద్రంలో వివిధ శాఖల్లో 24 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసి దేశభక్తి చాటుకోవాలి. పైగా ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా సహాయం, 11 రకాల విద్యాసంస్థలు, రెవెన్యూ లోటు...వంటి హామీలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి చేసిన నమ్మక ద్రోహం వలన నిరుద్యోగ యువతకు తీరని నష్టం జరిగింది.
నేను అధికారంలోకి వస్తే ఒకేసారి 2 లక్షల 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాము 6,03,325 ఉద్యోగాలు ఇచ్చామని రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మే 30న అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చుకున్నారు. ఇందులో గ్రామ, వార్డు వాలంటీర్లు 2,59,565 మంది ఉన్నారు. వీళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనట. ఇచ్చేది రూ.5 వేల జీతం. వేతనం పెంచమని అడిగితే 'మీరు సేవకుల'ని స్వయంగా ఆయనే అన్నారు. ఇప్పుడు మాత్రం ఉద్యోగులు ఎట్లా అయ్యారో ఎవరికీ అర్థం కావడం లేదు. గ్రామ, వార్డు సచివాలయల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 1,21,518 మంది పని చేస్తున్నారు. వీరు నెలకు రూ.15 వేల వేతనంతో పని చేస్తున్నారు. కనీస వేతన చట్ట ప్రకారం అయినా నెలకు రూ.18 వేలు ఇవ్వాలి. రెండేళ్ల తర్వాత పర్మినెంటు చేస్తామన్నారు. అదీ లేదు. వీళ్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారో ప్రభుత్వమే సెలవివ్వాలి. గతంలో పని చేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కార్పొరేషన్‌లో చేర్చి 95 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బాలు కొట్టుకున్నారు. ఆర్.టి.సి లో 54 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. త్వరలో రిటైర్ అయ్యేవారు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. ఇప్పుడే ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడే ఎలా రిటైర్ అవుతారో మరి. కోవిడ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్లు అంటూ రాష్ట్రవ్యాప్తంగా 26,325 మందిని తీసుకుని, ఇప్పుడు సగం మందిని ఇంటికి పంపించారు. ఇందులో చాలా మందికి వేతనాలు కూడా రాలేదు. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్లు దాదాపు రాష్ట్రంలో 9260 మంది ఉన్నారు. వీళ్లు ఉద్యోగులో, హమాలీలో అర్థంకావడం లేదు. ప్రభుత్వ మద్యం షాపులు రాష్ట్ర వ్యాప్తంగా 2876 ఉన్నాయి. ఒక్కో షాపులో ఒక సూపర్‌వైజర్, ముగ్గురు సేల్స్‌బార్సు ఉంటారు. ఆ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో ఎవరికీ తెలియదు. జగన్ ప్రభుత్వం దృష్టిలో వీళ్ల్లూ ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ప్రకటనలో చెప్పిన ఉద్యోగులు సంఖ్య మొత్తం బోగస్ అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
ఎంటీ జాబ్ క్యాలెండర్ ?
ఏ రాష్ట్రమైనా తమ రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసి ముందుగానే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో, ఎప్పుడు రిటైర్ అవుతారో ప్రకటించి వాటిని భర్తీ చేసి ప్రజా సంక్షేమం కోసం ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు మనకన్నా చిన్న రాష్ట్రమైన కేరళ ప్రభుత్వం ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకటించి 15 వేల నుంచి 25 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇటు నిరుద్యోగులకు అటు ప్రజలకు ఇబ్బంది లేకుండా జాబ్ క్యాలెండరును పకడ్బందీగా అమలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు 'ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తాం, ఉద్యోగాల విప్లవం సాధిస్తాం' అని ప్రకటించారు. రెండు సంవత్సరాల తర్వాత జూన్ 18వ తేదీన 10,143 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.
వీటిలో 9621 పోస్టులు సాధారణ డిగ్రీకి సంబంధం లేనివి. లక్షల్లో ఖాళీలుంటే 10 వేలు భర్తీ చేయడం ఎంటి? పోనీ ఇదేం నోటిఫికేషన్ కూడా కాదు. కేవలం ఖాళీలను ప్రకటించడం మాత్రమే. దీనికే ప్రభుత్వం ఇన్ని అబద్దాలు ఎందుకు ఆడుతున్నదో అర్థంకావడం లేదు. గతంలోనే ఆర్థిక శాఖ 2,35,749 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 77 వేలు పోస్టులు భర్తీ చేయవచ్చని చెప్పింది. వాటిని భర్తీ చెేయడానికి ముఖ్యమంత్రికి చేతులు రావడం లేదు.
జూన్ 18న ముఖ్యమంత్రి ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో టీచర్ పోస్టుల ఊసేలేదు. మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉంటుందన్న జగన్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా డిఎస్సీ గురించి మాట్లాడకపోవడం మాట తప్పడం కాదా? ఇప్పటికే 33 పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడు. 8,958 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉన్నాయి. పైగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 'నూతన విద్యా విధానం-2020' మన రాష్ట్రంలో అమలు జరుపుతామని ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల కంటే ముందే ప్రకటించారు. ఆ చట్టాన్ని గనుక అమలుచేస్తే విద్య మరింత వ్యాపారీకరణ, కేంద్రీకరణ, కార్పొరేటీికరణ అవుతుంది. బడుగులు విద్యకు దూరం అవుతారు. మరోవైపు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం గత రెండు సంవత్సరాల్లో 6 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30 ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి టీచర్లను రిక్రూట్ చేయకుండా, లక్షలాది మంది బి.ఇడి, టి.టి.సి. నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. తక్షణమే 25 వేల పోస్టులతో డిఎస్సీ ప్రకటించాలి.
ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 7,740 పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర హోంమంత్రి గతంలో ప్రకటించారు. మరో సందర్భంగా 6,500 పోస్టులు అన్నారు. చివరకు క్యాలెండర్‌లో మాత్రం 450 పోస్టులు చూపించారు. వాస్తవానికి పోలీసు శాఖలో 16,000 పోస్టుల వరకూ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 లో 907 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ తెలిపారు. ఇప్పుడు కేవలం 36 పోస్టులు మాత్రమే జాబ్ క్యాలెండర్‌లో చూపించడం నిరుద్యోగులను మోసం చెయ్యడమే. అన్ని గ్రూప్స్‌లో కలిపి 5000 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలి.
ఈ జాబ్ క్యాలెండర్‌లో ఇంజనీరింగ్, యంబిఏ, యంసిఏ, డిప్లమా చదివిన వారికి పోస్టులు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే పంచాయితీరాజ్, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి, ఇతర శాఖలకు సంబంధించిన పోస్టులు 4000 ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 1150 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా ఆ శాఖలో సంస్కరణలు సాధ్యం కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి లైబ్రేరియన్ల పోస్టులు భర్తీ చెయ్యడం లేదు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మాట ప్రకారం లైబ్రేరియన్ల పోస్టులు 6000 భర్తీ చేయాలి. ప్రతి సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉండాలి. కానీ చాలా సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో ఖాళీగా ఉన్న 8542 పోస్టులు భర్తీ చేయాలి. విద్యుత్ శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి గురించి జ్యాబ్ క్యాలెండర్ పట్టించుకోలేదు.
రండి పోరాడి సాధించుకుందాం
ముఖ్యమంత్రి ప్రకటించిన ''జాబ్ క్యాలెండర్''పై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రకటించిన రోజు నుండి ఈరోజు వరకు ''జాబే లేని క్యాలెండర్ మాకొద్దు'' అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాలు ఈ ఉద్యమంలో ముందుండి పోరాడుతున్నాయి. శాంతియుత ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించడం, బెదిరించడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఏదైనా ధర్నాలకు పిలుపునిస్తే వారి ఇళ్లకు, ఆఫీ˜ిసులకు పోలీసులు వెళ్లడం, అరెస్టులు చేయడం గత పది రోజులుగా జరుగుతోంది. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో యువత సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపించాల్సి వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.
/ వ్యాసకర్త డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు,
సెల్ :77801 41311 /
జి. రామన్న











