Aug 27,2022 22:56

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
అనేక తప్పుడు కారణాలతో పెన్షన్లను వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి, 50వ డివిజనన్‌ కార్పొరేటర్‌ బోయి సత్యబాబు డిమాండ్‌ చేశారు. ఆపివేసిన పెన్షన్లు ఇవ్వాలని, పెండింగ్‌ పించన్లు విడుదల చేయాలని కోరుతూ సిపిఎం పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో 50వ డివిజన్‌ పరిధిలోని 175వ సచివాలయం వద్ద పెన్షనర్లతో కలిసి శనివారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బోయి సత్యబాబు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని ప్రచారం చేస్తున్నారనీ కానీ, పేదల పెన్షన్‌ రద్దు చేశారన్నారు. ఆగస్టు నెలలో 50వ డివిజన్‌లో సుమారు 20 మందికి పెన్షన్లు ఆపేశారని, ఇది చాలా దుర్మార్గమన్నారు. మరోవైపు డెత్‌ సర్టిఫికెట్లు ఉన్న ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతువులకు సంబంధించి వారికి సొంత ఇళ్లు లేకపోయినా కరెంటు నాలుగు మీటర్లు ఉన్నాయంటూ సాకుతో ప్రభుత్వం వారి పెన్షన్లు తొలగించేశారని తెలిపారు. ఈనెల 75 మందికి పెన్షన్లు పేర్లు విడుదల చేసి చేతికి 40 మందికి పెన్షన్లు మాత్రమే ఇచ్చారని, సచివాలయం ద్వారా ప్రతి నెల నెలా పెన్షన్ల పెట్టుకుంటే ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రతి పథకం ఆరు నెలలకొకసారి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, మరీ ఆరు నెలలు దాటిపోయినా పెన్షన్లు రావటం లేదని మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల పెన్షన్లు కూడా నిలిపివేశారని అన్నారు. ఇదేనా సంక్షేమం అంటే ఆని ప్రశ్నించారు. ఈ నిరసలో ఐద్వా డివిజన్‌ అధ్యక్షురాలు కే. వరలక్ష్మి, పెన్షన్‌ దారుల డివిజన్‌ నాయకులు భాషా, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.