ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘాల్లో పనులు చేసిన గుత్తేదారులు అప్పుల పాలవుతున్నారు. అభివృద్ధి పనులు చేయడమే వారి పాలిట శాపంగా మారింది. ఖజానాలో నిధులు పుష్కలంగా ఉన్నా...దానికి సంబందించిన తాళం ప్రభుత్వం చేతిలో ఉండడంతో ఆ నిధులను ఉపయోగించుకోవాడానికి మున్సిపల్ అధికారులకు అధికారం లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో బిల్లులు ఎక్కించినా ప్రయోజనం లేకుండా పోతోంది. కోట్లాది రూపాయల పనులు పూర్తి చేసి, దానికి సంబందించిన బిల్లులను సిఎఫ్‌ఎంఎస్‌లోకి ఎక్కించినా ఫలితం లేకుండా పోయింది. హిందూపురం పురపాలక సంఘంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15కోట్లు, సాధారణ నిధులు నిధులు రూ.4.50కోట్లు మూులుగుతున్న గుత్తేదారులకు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో గుత్తేదారులు అప్పుల పాలై పురపాలక సంఘంలో అభివృద్ది పనులు అంటేనే పరుగెత్తే పరిస్థితి నెలకొంది.
బిల్లుల కోసం కొన్నేళ్లుగా గుత్తేదారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పూర్తి చేసిన పనులను ఇంజనీరింగ్ అధికారులు ఎం-బుక్లో రికార్డు చేసి, అందుకు సంబంధించిన మొత్తం వారి ఖాతాల్లో వేయడానికి బిల్లులను సిఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేస్తారు. నిధులు అందుబాటులో ఉన్నప్పుడు ఆర్ధిక శాఖ జమ చేస్తుంది. కానీ పనుల వివరాలు ఆన్ లైన్‌లో నమోదు చేయడంలోను, సిఎఫ్‌ఎంఎస్‌లో ఎక్కించే విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని ఐదు నెలల కిందట ప్రభుత్వం ప్రకటించింది. మార్పులు ఏమిటి..? బిల్లులను ఎలా అప్లోడ్ చేయాలి...?. ఎలాంటి చర్యలు చేపట్టాలి...? అనే అంశాలపై అధికారులకు అవగాహన కల్పించలేదు. మరో వైపున ఐదు నెలలుగా గుత్తేదారుల బిల్లులను సిఎస్‌ఎంఎస్‌లో అప్లోడ్ చేసే పాత లాగిన్‌ను నిలిపివేశారు. దీంతో పనులు చేసిన గుత్తేదారులు లబోదిబో మంటున్నారు. హిందూపురం పురపాలక సంఘంలో సాధారణ నిధులకు సంబందించి 111 పనులకు గాను సుమారు రూ.3.13కోట్లకు సంబందించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే పురపాలక సంఘంలో దాదాపు రూ.4.50కోట్లు నిధులు ఉన్నాయి. సాధారణ నిధులకు సంబందించి పనులను చేస్తే చెక్కులు ఇస్తారని గుత్తేదారులు చేశారు. అయితే దీనికి సంబందించిన అధికారం సైతం ఆర్థికశాఖ తన అధీనంలోకి తీసుకోవడంతో ఇవి సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 15వ ఆర్థిక సంఘానికి సంబందించి రూ.15కోట్లు నిధులు వచ్చాయి. దీనికి సంబందించి ఇప్పటికే రూ.2.60కోట్ల పనులకు సిఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశారు. ఇప్పటి వరకు వాటికి సంబందించి ఏలాంటి ఉత్తర్వులు లేదు. హిందూపురం మున్సిపాలిటీలో ఏకంగా రూ.5.50 కోట్ల విలువైన పనుల బిల్లులు సిఎఫ్‌ఎంఎస్‌లో చేర్చినా నిధులు మంజూరు కాక గుత్తేదారులు అల్లాడిపోతున్నారు. మున్సిపాలిటీ చుట్టూ, ఇంజినీరింగ్, అకౌంటింగ్ అధికారుల చుట్టూ రోజు తిరుగుతున్నారు. ఎవరూ స్పందించక పోవడంతో చివరకు ఇక నుంచి ఎలాంటి పనులు చేయరాదని గుత్తేదారుల సంఘం తీర్మానం చేసి చైర్‌పర్సన్, కమిషనర్‌కు వినతులు ఇచ్చి పనులు నిలిపివేశారు. దీంతో అధికారులు, పాలకులు వారితో మాట్లాడి పూర్తి భరోసా ఇవ్వడంతో గత నెల రోజులుగా పనులు జరిగాయి. అయితే ఈ నెల రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఈ నెల 15వ తేదికి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబందించి బిల్లులు అప్‌లోడ్ చేయడానికి తుది గడువు విధిస్తు ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో అధికారులు ఇప్పటి వరకు పూర్తి అయిన పనులను సిఎఫ్‌ఎంఎస్‌లోకి ఎక్కించడానికి కుస్తీ పడుతున్నారు. బుధవారం చివరి రోజు కావడంతో సర్వర్ సరిగా పని చేయక పోవడంతో అన్ని బిల్లులు ఎక్కించలేక పోయారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు మున్సిపల్ ఖాతాలో ఉన్నా బిల్లులు పెట్టకపోవడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
పనులు పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురుచూపు
పట్టణంలోని కొట్నూరులోని ఇందిరమ్మకాలనీలో ఓ గుత్తేదారుడు రూ.40 లక్షలతో మురుగు కాలువ నిర్మాణం, రూ.40 లక్షలతో పైపులైన్ పనులు పూర్తి చేశాడు. ఇదే గుత్తేదారుడితో సింగిరెడ్డిపల్లిలో నీటి సమస్య ఉండటంతో అధికారులు యుద్ధప్రాతిపాదికన రూ.10 లక్షలతో పైప్‌లైన్ నిర్మాణం, మోటార్ల ఏర్పాటు తదితర పనులు చేయించారు. అత్యవసరంగా చేసిన పనులకు బిల్లులు చేయలేదు. పనులు పూర్తి చేసినా, బిల్లులు మాత్రం సిఎస్‌ఎంఎస్ పోర్టర్‌లోకి చేరలేదు. మరో గుత్తేదారు 35వ వార్డులో రూ. 40 లక్షలతో ఒకటి, రూ.25 లక్షలతో మరొక మురుగు కాలువను నిర్మించాడు. బిల్లులు మంజూరు కాకపోవడంతో లబోదిబోమంటున్నాడు. పట్టణంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 3 కోట్లతో మురుగు కాలువలు నిర్మించారు. ఇవేవీ ఆన్‌లైన్ కాలేదు. మున్సిపల్ సాధారణ నిధులతో రూ.లక్ష, రెండు లక్షలు, 5 లక్షల అభివృద్ధి పనులు దాదాపు రూ.2 కోట్ల విలువైనవి చేశారు. వాటికి అతీగతి లేదు. సిఎఫ్‌ఎంఎస్ పని చేయడం లేదని, గుత్తేదారులు చేసిన పనులను అధికారులు రికార్డు చేయడం లేదు. వాటిని ఎం-బుక్ లోకి ఎక్కించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గుత్తేదారులు వాపోతున్నారు. వీటితో పాటు పంచాయితీరాజ్, ఆర్‌డబ్యూఎస్ శాఖలకు సంబందించిన పనులకు సంబందించిన బిల్లులు సైతం ఇంత వరకు మంజూరు కాలేదు. పట్టణంలోని నూతనంగా తహశీల్దార్ కార్యాలయం నిర్మాణం చేసి సంవత్సరం గడుస్తున్న బిల్లులు మంజూరు కాక పోవడంతో గుత్తేదారులు దానిని అధికారులకు అప్పగించ లేదు. గత ప్రభుత్వం హయాంలో ఎంజిఎం మైదానంలో బాలకృష్ణ ప్రారంభించిన ఇండోర్ స్టేడియం పనులకు సైతం బిల్లులు మంజూరు కాక ఆగిపోయాయి. ఇలా గుత్తేదారులు పనులు పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురుస్తున్నారు.
ముగిసిన గడువు
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబందించి జరిగిన అభివృద్ది పనులకు సంబందించి ఫిబ్రవరి 15వ తేది లోపు సిఎఫ్‌ఎంఎస్‌లోకి ఎక్కించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు లేఖ నెంబరు 273తో ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక సంఘాల్లో నిధులు మూలుగుతున్నా గత 6 నెలలుగా ఆర కొర బిల్లులు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. అభివృద్ది పనులు జరిగి, వచ్చిన నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి పురపాలక సంఘాల్లో ఏర్పడింది.










