నిధుల మళ్లింపు దారుణం
ప్రజాశక్తి-బిట్రగుంట : రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ఎస్‌సి ఎస్‌టి నిధులను పక్కదారి మళ్లించడం దారుణమని దళిత సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై ఆదివారం బోగోలు బజార్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఎస్‌సి, ఎస్‌టిల దళితుల సబ్‌ప్లాన్ రూ.50 వేల కోట్ల నిధులను నవరత్నాలకు మళ్లిస్తున్నారని తెలిపారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆస్తులను అదానికి అంటగడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి ఎస్‌టి సంక్షేమ నిధులను పక్కదోవ పట్టిస్తుందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల నుండి రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలు సబ్సిడీ రుణాలు లేక ఆర్థికంగా వెనకబడిపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్‌సి ఎస్‌టి శాసనసభ్యులు చాలామంది ఉన్నా దళితులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం లేదన్నారు. కార్యక్రమంలో మిట్ట అశోక్, రమణయ్య, ఆత్మకూరి పోలయ్య, ఆటో కార్మికులు రెహమాన్, రమణయ్య, కుమార్, కాలు భారు, మస్తానయ్య, దళితులు, తదితరులు పాల్గొన్నారు.










