Nov 09,2023 21:31

బాణాసంచా విక్రయాల షాప్‌

ప్రజాశక్తి-విజయనగరం కోట :  బాణసంచా వ్యాపారానికి ప్రసిద్ధి గాంచిన విజయనగరంలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేనివిధంగా వ్యాపారులు ఇష్టానుసారం మందుగుండు సామాగ్రి ధరలు పెంచేసి దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారికి ఆనుకొని, పెట్రోల్‌బంకు సమీపాన శాశ్వతంగా షాపులు నిర్మించినా, తాత్కాలికంగా షెడ్‌లు వెలిసినా అధికారులు కనీసం కూడా పట్టించుకో పోవడంపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజయనగరంలోని ఆర్‌టిఒ కార్యాలయం చుట్టుపక్కల గత కొంతకాలంగా మందుగుండు సామాగ్రి హోల్‌సేల్‌, రిటైల్‌ అమ్మకాలు సాగుతున్నాయి. దీపావళి సందర్భంగా వేలాది మంది జిల్లా నలుమూలల నుంచే కాకుండా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి సామగ్రి కొనుగోలు చేస్తుంటారు. అయితే వ్యాపారులు ఇదే అదునుగా బాణాసంచా ధరలను అమాంతంగా పెంచేసి కొనుగోలుదారులను దోచేస్తున్నారు. వాస్తవానికి బాణా సంచా ధరలు ఆ ప్యాకింగ్‌లపై ఉన్న ధరకు, వాస్తవ ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. చిచ్చుబుడ్డి ప్యాకెట్‌ పై ఎంఆర్‌పి ధర రూ.500 ఉంటే దాని ధర వంద రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ వ్యాపారులు వాటిని రూ.400నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఇలా కాకరు పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, భూ చక్రాలు, తాళ్లు, సిసింద్రీలు, మతాబులు, వెన్నముద్దలు, తాటాకు బాంబులు, పెన్సిళ్లు ఇలా అన్నింటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఉన్నాయి. దీపావళి నేపథ్యంలో కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేస్తున్నా వాటికి లెక్కా జమ ఉండడం లేదు. వాటికి పన్ను కూడా కట్టిన దాఖలాలు లేవు. వీటి ధరలపై అడిగితే తమ సిబ్బందితో బయటకు గెంటేసే దుస్థితి ఉంటోంది. మరోవైపు మందుగుండు షాపుల్లో బాల కార్మికులను నియమించుకుంటూ అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో పనివారిని ఆదుకున్న దాఖలాలు కూడా లేవు.
పట్టించుకోని అధికారులు
నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే జాతీయ రహదారికి అనుకొని భారీగా బాణాసంచా విక్రయాలు సాగిస్తున్నారు.మరోవైపు పెట్రోల్‌బంకుకు కనీసం వంద మీటర్లు దూరం కూడా లేకుండా షాపులు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఏదైనా ప్రమాదం సంభివిస్తే భారీ ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ధరలపై గాని,ప్రభుత్వ నిబంధనలపై గాని అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు, అగ్నిమాపకశాఖ అధికారులకు ఏటా వీరు లంచాలు ఇవ్వడం వల్లే వారు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సిందే వారికి ఇవ్వకపోతే ఇక్కడ షాపులు నడపగలమా? అంటూ స్వయాన వ్యాపారులు చెప్పడం అధికారుల తీరుకు అద్ధం పడుతోంది.
అందుబాటులో లేని ధరలు
దీపావళి అంటేనే అనందాల సందడి.. ఇంటిళ్ల పాదీ కలిసి జరుపుకునే పండగ.. కానీ నేడు అలాంటి పండగ సామాన్య ప్రజలకు గుదిబండగా మారుతోంది. బాణా సంచా కొనాలంటేనే గుండె గుబేలు మంటోంది. విజయనగరంలో దీపావళి సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హోల్‌సేల్‌ అంటూ రిటైల్‌ ముసుగులు వ్యాపారులు దోచుకుంటు న్నారు. అందరూ సిండికేట్‌ అయిపోయి గత నెలరోజులుగా ధరలను అమాంతంగా పెంచేశారు. బాణా సంచా ప్యాకింగ్‌లపై ఉన్న ధరకు, వాస్తవ ధరకు 200 రెట్లు వ్యతాసం ఉంటుంది. కానీ వ్యాపారులు ఎంఆర్‌పి ధరలకు లేదంటే దానికి పదిశాతం తగ్గించి విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఉదాహరణకు అయాన్‌ చిచ్చుబుడ్డిల ధర రూ.650ఉండగా, 500వరకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి వీటి ధర రూ.200 లోపే ఉంటుంది. కానీ వ్యాపారులు ఎంఆర్‌పి ముసుగులో జనాలను దోపిడీ చేస్తున్నారు.