ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రూ.5,056 కోట్లు రావాల్సి వుందని, ఆ నిధులు రాగానే రైతులకు ధాన్యం బకాయిలను చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా మొత్తం బకాయిలు రైతులకు చెల్లిస్తామన్నారు. అధికారంలో వున్నపుడు రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించని చంద్రబాబునాయుడు ఇపుడు అధికారం పోగానే రైతుల ముసుగులో డ్రామాలాడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆదివారంనాడు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్రకార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో చెల్లించిన మొత్తాన్ని తమ ప్రభుత్వం ఏడాదిలో చెల్లించిందని అన్నారు. తెలుగుదేశం నాయకులు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేంద్రం రాష్ట్ర సివిల్ సప్లైకు రూ.5,056 కోట్లు చెల్లించాలని, ఇందులో మొదటి విడతగా రూ.1,600కోట్లను ఈ వారంలో చెల్లిస్తామని చెబుతున్నారని, మరో రూ.1,600కోట్లు నాబార్డునుండి వస్తాయని ఆ నిధులు రాగానే రైతుల ధాన్యం బకాయిలను చెల్లిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాల్సిన ప్రతిపైసా ఇస్తామని అన్నారు. చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మొద్దని, రైతులకివ్వాల్సిన డబ్బులు బాబు ఏనాడూ సకాలంలో చెల్లించలేదని తెలిపారు. రైతు రాజులా బతకాలన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.










