Aug 26,2022 22:55

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌
చూపు లేక భారమైన అంధునికి నేత్రాలను సమకుర్చడం ద్వారా కుటుంబానికి ఆధారవంతుడ వుతాడని ప్రతి ఒక్కరూ నేత్ర దానం చేసి అంధులలో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకు ఆధ్వర్యంలో వాసవ్య మహిళ మండలి భవనంలో నిర్వహిస్తున్న 37వ నేత్రదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజర య్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అంధత్వం అనేది భరించలేని బాధ అన్నారు. ఎంతో మంది అంధులు కంటి చూపులేక చీకటి బతుకుతో మరోకరిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలనేది చెప్పడం కాదని ఆచరణలో పెట్టిచూపాలనే ఉద్దేశంతో నేడు నా నేత్రాలను దానం చేస్తున్నానంటూ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తన నేత్రాలను గోరా ఐ బ్యాంకు దానం చేస్తున్నట్లు ప్రకటించి నేత్ర దాన ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేసి ఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.జి సమరం కు అందజేశారు. చూపు కోల్పోయిన వారికి మరల చూపు వస్తే వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. తాను దానం చేసిన నేత్రాలు ఒక అంధుని జీవితంలో వెలుగులు నింపి ప్రపంచంలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరోకరిపై ఆదారపడకుండా జీవిస్తే నా జన్మ దన్యమైనట్లేనన్నారు. స్వేచ్ఛ గోరా ఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.జి సమరం మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా సేవా దృక్పదంతో నేత్రదాన కార్యక్రమాల ద్వారా నేత్రాలను సేకరించి ఇప్పటివరకు 900 మందికి పైగా అంధులకు అమర్చి వారి జీవితాలలో వెలుగులు నింపామన్నారు. నేత్ర దాన పక్షోత్సవాల సందర్భంగా 27వ తేదిన పాఠశాలలు కళాశాలలో అవగాహన కార్యక్రమాలను, 28వ తేదిన నగరంలో ప్రచార కార్యక్రమాలను, 29వ తేదిన విద్యార్థిని విద్యార్థులకు నేత్రదానం పై వ్యాస రచన పోటీలను 30వ తేదిన చిత్రలేఖన పోటిలను సెప్టెంబర్‌ 1వ తేదిన ర్యాలీలు, 2వ తేది పాటల పోటీలు, 3వ తేది సెమినార్‌లు, 4వ తేదిన ప్రభుత్వ ప్రైవేట్‌ ఆసుపత్రులలో కరపత్రాల పంపిణీ 5వ తేదిన అంధులకు నేత్ర చికిత్స కార్యక్రమం, 6వ తేది ఆంధబాలలకు ఆటలపోటీలు 7వ తేదిన ప్రజల చైనత్య కార్యక్రమాలను నిర్వహించి 8వ తేదిన వాసవ్య మహిళ మండలి భవనం నందు ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తొలుత అమ్మా... మీరు నాకు కనిపించడం లేదు మిమ్మల్ని చూసేందుకు నాకేవరూ సహాయం చేయలేరా?అంటూ రూపొందించిన ే పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విడుదల చేసి నేత్ర చికిత్సలు అందిస్తున్న వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో వాస్యవ మహిళ మండలి కార్యదర్శ జి రశ్మి , కోశాదికారి సుజాత, నేత్ర చికిత్స వైద్యులు డా. కె విజయశేఖర్‌, డా. పి ప్రభాకర్‌ శాస్త్రి, డా ఏ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.