ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ రాష్ట్రంలో చేనేతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవితి తల్లి ప్రేమను చూపుతున్నాయని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలక్రిష్ణలు ఆరోపిం చారు. మంగళవారం ధర్మవరం పట్టణం మార్కెట్ వీధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో చేనేతల కోసం అనేక హామీలిచ్చి వాటిని నేటికీ అమలు చేయలేకపోతున్నారన్నారు. చేనేత పాలసీ అమలుచేస్తామని, 45 ఏళ్లకు పింఛన్ ఇస్తామని 50 ఏళ్లు అయినా పింఛన్ ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లు వయస్సు ఉన్న నేతన్నలు ఏ పనీ లేరని, అటువంటి వారికి ఎలాంటి ఆంక్షలూ లేకుండా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకులలో ముద్రా రుణాలు ఇవ్వాలని.. పావలా వడ్డీ రుణాలు కూడా ఇవ్వాలన్నారు. ముడి పట్టు సరుకుల ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందే తప్ప వాటిని తగ్గించాలన్న ఆలోచన కూడా చేయలేదని మండిపడ్డారు. సెంట్రల్ శిల్క్ బోర్డు ద్వారా రేషం, వార్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి వాటిని సబ్సిడీతో చేనేత కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. పవర్ లూమ్స్ పట్టుచీరలు తయారు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతలకు రూ.2 వేలు కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్ రూ.200 కోట్లు మాత్రమే కేటాయిస్తూ చేతులు దులుపుకుంటోందన్నారు. చేనేత కార్మికులు పనులు లేక.. వస్తున్న ఆదాయం సరిపోక.. అప్పులు చేసి వాటిని తీర్చలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పరామర్శించిన దాఖలాలు కూడా లేవన్నారు. చేనేతకు కేటాయించిన బడ్జెట్ ఉద్యోగులకే సరిపోతోందని, కార్మికులకు ఏమిచ్చి ఆదుకుంటారని ప్రశ్నించారు. దీనికి తోడు చేనేతపై జీఎస్టీ విధించిందని వాటిని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా శివదుర్గారావు, అనుముల వీరబ్రహ్మం, రాష్ట్ర సహాయ కార్యదర్శి గంగాధరరావు, సభ్యులు రాజు, ఓబులేసు, బషీర్ అహమ్మద్, నాయకులు చౌడప్ప, అన్నం సూర్యనారాయణ పాల్గొన్నారు.










