ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 19 రోజుల పాటు అంటే ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలూ కరోనాకు పూర్వం ఉన్న వేళల ప్రకారమే ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకకాలంలో పనిచేస్తాయి. మొత్తం 17 కొత్త బిల్లులను ఆమోదం కోసం ప్రవేశపెడతారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టనున్నాయిరీ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఆదివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇందుకు స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్థవంతమైన చర్చకు సిద్ధమని ప్రకటించారు. 17 కొత్త బిల్లులతో పాటు ఇటీవల తీసుకొచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేయనుంది. జనాభా నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో పాటు విద్యుత్ బిల్లును కూడా మరోసారి సభ ముందుకు తెచ్చేవీలుంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, వంట నూనెలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, నిరుద్యోగం, కరోనా పరిస్థితి, రైతుల ఆందోళన, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, దేశద్రోహ చట్టంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టనున్నాయి. అలాగే వ్యవసాయ రంగ సమస్యలపై అన్నదాతలు లేవనెత్తుతున్న డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇవ్వాలని కూడా నిర్ణయించాయి.
జోషి నేతృత్వంలో అఖిలపక్షం భేటీ
వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం నాడిక్కడ పార్లమెంట్‌లోని ఎనెక్స్ భవనంలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతఅత్వంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు 33 పార్టీలకు చెందిన 40 మంది పైగా నాయకులు సమావేశంలో పాల్గన్నారు. కొత్త, పాత బిల్లులతో సహా దాదాపు 31 బిల్లులను ఆమోదానికి పార్లమెంట్ ముందుకు వస్తాయని అఖిల పక్షానికి జోషి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, అర్ధవంతమైన చర్చలు జరుపుదామని, పార్లమెంటరీ నియమ నిబంధనలకు అనుగుణంగా సభలో లేవనెత్తే ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.










