దుబాయ్ : దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేడు మరో సమరం జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఏడింటిలో ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఢిల్లీ పది పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. అన్నే మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే గెలుపొంది ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లు ఇప్పటికే ఒకసారి తలపడగా ఢిల్లీ విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీపై విజయం సాధించాలని రాజస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. యువ ఆటగాళ్లతో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న ఢిల్లీని ఎదుర్కోవడం రాజస్తాన్‌కు కొంచెం క్లిష్టమైన పనే. అయితే డేవిడ్ మిల్లర్, బెన్‌స్టోక్స్, సంజూ శాంసన్ చెలరేగితే మాత్రం గెలుపు ఖాయమే అని చెప్పొచ్చు. సంజూ శాంసన్ ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే నిరూపించుకుని మిగిలిన మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఇక ఢిల్లీకి శిఖర్ ధావన్, స్టోయినీస్ లాంటి పటిష్ట ఓపెనర్లు ఉన్నారు. రిశభ్ పంత్ చెలరేగి ఆడాల్సి ఉంది. హెట్‌మెయిర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా తమను తాము నిరూపించుకుంటూనే ఉన్నారు. బౌలింగ్‌లోనూ ఈ జట్టు పటిష్టంగానే ఉంది. ఎన్రిచ్ నోర్జే, కాగిసో రబాడ పవర్‌ప్లేలో వికెట్లు తీయగల సత్తా ఉన్నోళ్ళు. ఇక స్పిన్‌లోనూ అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి అనుభవజ్ఞులు ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. చూడాలి మరి ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో.










