Dec 13,2021 10:07
  • ఫిబ్రవరిలోగా రూ.15 వేల కోట్ల నేవీ షిప్‌లపై సంతకాలు జరిగేనా ?
  • నేటి నుంచి 19 వరకూ షిప్‌యార్డులో డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) 1941 జూన్‌ 21న ఏర్పాటై ఇటీవలే 80 ఏళ్ల ఆవిర్భావ ఉత్సవాన్ని జరుపుకుంది. నౌకలు, జలాంతర్గాముల నిర్మాణాలు, మరమ్మతుల నిర్వహణలో అంతర్జాతీయంగా పోటీపడుతూ ప్రపంచ షిప్‌ బిల్డింగ్‌ మార్కెట్‌లో గుడ్‌ కాంపిటెటర్‌గా వెలుగొందుతోంది. ఈ అద్భుత క్షణాల్లో ఇండియన్‌ నేవీకి సంబంధించిన ఐదు ఫ్లీట్‌ సపోర్టు షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)ల నిర్మాణ బాధ్యతలను హెచ్‌ఎస్‌ఎల్‌ చూడాల్సి ఉంది. సుమారు రూ.15 వేల కోట్ల ఆర్డర్లు గడిచిన రెండేళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలోగా నేవీ ఆర్డర్లపై షిప్‌యార్డు సంతకాలు చేయాల్సి ఉంది. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తులు, నౌకలు, సబ్‌మెరైన్ల నిర్మాణాల విషయంలో నామినేషన్‌ పద్ధతిలోనే హెచ్‌ఎస్‌ఎల్‌కు ఈ ఆర్డర్లు రావాల్సి ఉంది. దీంట్లో పోటీ పడేందుకు ఇతర షిప్‌ బిల్డర్‌లకు ఆస్కారం లేదు. కాగా, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఫైనలైజ్‌ చేయాల్సి ఉన్నా జాప్యం జరుగుతోందన్నది షిప్‌యార్డు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 2010లో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డును హేండోవర్‌ చేసుకున్నప్పటి నుంచీ ఆర్డర్లు తొలుత కొన్నాళ్లు వచ్చినా, తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. తాజాగా ఐదు ఎఫ్‌ఎస్‌ఎస్‌ల ఆర్డర్లు రాకపోతే హెచ్‌ఎస్‌ఎల్‌కు ఒక్క వర్క్‌ ఆర్డర్‌ కూడా లేనట్లేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 80 ఏళ్ల వార్షికోత్సవంలో ఈ ఏడాది రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులను దక్కించుకుని సవాళ్లను అధిగమించి, లక్ష్యాల దిశగా షిప్‌యార్డు వెళ్లబోతుందని షిప్‌యార్డు చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమడోర్‌ హేమంత్‌ ఖత్రి ఉద్యోగులు, అధికారుల సమక్షంలో పేర్కొన్నారు. షిప్‌యార్డు కల సాకారం కావాలని రక్షణరంగ ఉద్యోగులు, కార్మిక సంఘాలకు చెందిన నాయకులు కోరుతున్నారు.
 

                   నేడు డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌ను ఆన్‌లైన్లో ప్రారంభించ నున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

హిందుస్థాన్‌ షిప్‌యార్డులో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకూ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించి డిఫెన్స్‌ రంగ ఉత్పత్తులు, డిజైనింగ్‌, నౌకల మోడళ్లను తిలకించేందుకు ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రజలను ఆహ్వానించే ఎగ్జిబిషన్‌ను షిప్‌యార్డు అధికారులు ప్రారంభిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు షిప్‌యార్డులోని జివి నిలయం ఆడిటోరియంలో షిప్‌యార్డు మారిటైం హిస్టరీ గురించిన ప్రదర్శన జరుగుతుంది. దీన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆన్‌లైన్‌లో ఢిల్లీ నుంచి ప్రారంభిస్తారు.