లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం మండిపడ్డారు. బిజెపి సాంప్రదాయ ఓటర్లైన బ్రాహ్మణులు అధికార పార్టీకి ఓటు వేయరని భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో బ్రాహ్మణ సమాజంతో దగ్గరయ్యేందుకు ర్యాలీని చేపట్టనున్నారు. బ్రాహ్మణ సమాజంతో కనెక్ట్ కావడానికి బిఎస్‌పి ప్రధాన కార్యదర్శి ఎస్‌సి మిశ్రా నాయకత్వంలో ఈ నెల 23న అయోధ్య నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే.. బ్రాహ్మణ సమాజ ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయని తెలిపారు. డబ్బు, శక్తి వంటివి ఇతర పద్ధతులు వినియోగించి బిజెపి ప్రభావితం చేస్తున్నప్పటికీ తమ పార్టీ విధేయతతో ఉందని, దళిత కమ్యూనిటీలా బ్రాహ్మణ సమాజం కూడా బిఎస్‌పికి మద్దతు నివ్వాలని కోరారు. దళితులను ప్రభావితం చేయడానికి బిజెపి, కాంగ్రెస్ అన్ని మార్గాలను ఉపయోగించాయని అన్నారు.
'డబ్బు, శక్తిని వినియోగించి తప్పుడు వాగ్దానాలు చేశాయి. మీడియాను కూడా ఉపయోగించాయి. కానీ ఈ నకిలీ వాగ్దానాలకు దళితులు ప్రలోభాలకు లోను కాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. కానీ దళిత ఓట్ల శాతం చెక్కు చెదరలేదు. ఈ వర్గం సమాజ్ వాదీ పార్టీకి మద్దతు తెలుపలేదు' అని వ్యాఖ్యానించారు. గతంలో బిజెపికి ఓట్లు వేసినందుకు బ్రాహ్మణ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తోందని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పలు సమస్యలపై గళాన్ని వినిపించాలని తమ ఎంపిలను ఆదేశించినట్లు మాయావతి తెలిపారు. దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే అనేక విషయాలు ఉన్నాయని చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిన ఉదాసీనత చాలా విచారకరమన్నారు.
రైతుల అంశంతోపాటు, ఇంధనం, ఎల్పీజీ ధరలు, ద్రవ్యోల్బణం, కరోనా వ్యాక్సినేషన్ వంటి అనేక అంశాలను తమ పార్టీ ఎంపిలు పార్లమెంట్‌లో లేవనెత్తుతారని మాయావతి తెలిపారు.










