Nov 20,2020 06:34

ఒక జాతి మనుగడకు బాలలే ఊపిరి. ఏ జాతి అయితే బాలల సంరక్షణ, సంక్షేమం పట్టించుకోదో...ఆ జాతికి మనుగడ ఉండదు. బాలలే జాతీయ సంపద. వారి సంపూర్ణ వికాసానికి మనమందరం కలిసి సామాజిక బాధ్యతగా గుర్తించి సేవలు అందించాలి. బాలల రక్షణ, అభివృద్ధి మనందరి బాధ్యత.


ప్రపంచ జనాభాలో మూడో వంతు బాలలే. భారతదేశ జనాభాలో 50 శాతం యువకులు. వీరిలో 18 సంవత్సరాల లోపు బాలలు 42 శాతం ఉన్నారు. బాలలకు కూడా కొన్ని హక్కులున్నాయి. కాని వీరిని మానవులుగా గాని, వీరికి హక్కులున్నాయని గాని చూడరు. గుర్తించరు. వారిని కూడా మానవులుగా గుర్తించేందుకు...ప్రజలందరికీ వర్తించే చట్టాలు, బాలలకు వర్తించేలా, వారికి కూడా ఆత్మాభిమానం, గౌరవం వర్తించేలా...న్యూయార్క్‌ సిటీలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1989 నవంబరు 20న బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక నివేదికను తయారు చేసింది. దీన్ని 'కన్వెన్షన్‌ ఆన్‌ రైట్స్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌'' అని (సిఆర్‌సి) పిలుస్తారు. ఇది ప్రపంచ బాలలకు ఒక మైలురాయిగా భావించవచ్చు. ప్రపంచ బాలలకు గౌరవం, రక్షణ, అభివృద్ధి తదితర అంశాలు స్పష్టంగా ఈ సిఆర్‌సి లో ఉన్నాయి. దీనిని తమ దేశాల్లో అమలు చేసేందుకు అప్పట్లో 140 సభ్య దేశాలు ఆమోదించాయి. భారతదేశం కూడా సంతకం చేసింది. కాని భారతదేశం 1992 డిసెంబరు 11 నుంచి చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలుకు కృషి చేయడం ప్రారంభించింది. సిఆర్‌సి ప్రపంచ బాలలకు ప్రధానంగా 4 హక్కులను పేర్కొంది. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, అభివృద్ధిలో పాల్గొనే హక్కు.


భారత ప్రభుత్వం వీటిని అమలు చేసేందుకు అనేక ''చట్టాలు'' రూపొందించి బాలల భవిష్యత్తుకి భరోసా కూడిన వాగ్దానం చేసింది. ఈ చట్టాల్లో 'విద్యా హక్కు చట్టం-2009' ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. అయినప్పటికి నిత్యం బాలల హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బిజెపి తీసుకొస్తున్న నూతన విద్యా విధానం 2020 కూడా అటువంటిదే. దీనివల్ల బీద కుటుంబాల పిల్లలు చదువుకు దూరమవుతారు. బాలల హక్కులపై జరుగుతున్న ఇటువంటి దాడులను నిలువరించేందుకు నిరంతర ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇప్పటికి కొన్ని వేల మంది బాలలు కనబడకుండా పోతున్నారు. బాల్య వివాహాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలను వ్యభిచార కూపంలోకి నెట్టి వేస్తూనే ఉన్నారు. బాలలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఆడపిల్లలపై అకృత్యాలు, హింస, అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుండి ''కరోనా'' విజృంభణ కారణంగా బాలల హక్కులు పూర్తిగా హరించబడ్డాయి. స్కూళ్ల మూత వల్ల లక్షలాది మంది బాలలు చదువుకి దూరమయ్యారు. ప్రభుత్వం ప్రోత్సహించిన ఆన్‌లైన్‌ క్లాసులు అందరికీ అందుబాటులో లేవు. దాంతో గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు చెందిన చిన్నారులు విద్యకు దూరమై బాల కార్మికులుగా మారిపోయారు. ఆకస్మిక కరోనా నిబంధనల వలన లక్షలాది మంది వలస కార్మికులు, వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి పిల్లలు బాలకార్మికులుగా మారిపోయారు. వీరు అనేక అవమానాలకు, అకృత్యాలకు, హింసకు, శారీరక దోపిడీకి గురయ్యారు. కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇవన్నీ బాలల హక్కులు ఉల్లంఘనలే. కరోనా మహమ్మారికి తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరో మార్గం కనుచూపుమేరలో లేదని డబ్ల్యుహెచ్‌ఓ, యుఎన్‌ఓ నివేదికలు తెలుపుతున్నాయి. వ్యాక్సిన్‌ వచ్చే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే కరోనాను నిరోధించగమని చిన్నారులకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలో.... విపత్కర పరిస్థితుల్లో ఎలా మెలగాలో బాలలకు, టీచర్లుకు తర్ఫీదు ఇవ్వాలి. ఇందుకు బడ్జెట్‌లో అధిక మొత్తంలో కేటాయించాలి. ఈ కష్టకాలంలో బాలల సంపూర్ణ వికాసానికి, అభివృద్ధికి అండగా నిలబడాలి.
                                               - నరవ ప్రకాశరావు, బాలల హక్కుల కార్యకర్త, సెల్‌ : 90324 77463