ప్రజాశక్తి - ధర్మవరం టౌన్ : ధర్మవరం మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎల్.ఆదినారాయణ, అయూబ్ ఖాన్ డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో నిత్యం వెట్టిచాకిరి చేయిస్తున్నారే తప్ప వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. 2022 జూలైలో ఇచ్చిన హామీలను అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని వీడాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పారిశుధ్య, అవుట్‌సోర్సింగ్, ఇంజనీరింగ్ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈసమావేశంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లిపెద్దన్న, సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌హెచ్ బాషా , పారిశుధ్య కార్మికసంఘం అధ్యక్షుడు ఎం బాబు పాల్గొన్నారు.










