ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇళ్లపై కొండ చరియలు పడటంతో 30 మంది చనిపోయారు. మరో ఇద్దరు విద్యుత్ ఘాతంతో మరణించారు. రైల్వే ట్రాక్‌లన్నీ నీట మునగడంతో సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే తమ సర్వీసులను రద్దు చేశాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున మహుల్‌లోని భరత్‌నగర్‌లో ఇళ్లపై కొండ చరియలు పడడంతో ఈ ప్రాంతంలోనే 19 మంది మరణించగా, ఏడుగురికి తీవ్రంగా గాయలయ్యాయి. క్షతగాత్రులను రాజావడీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు రాత్రి వరకూ కొనసాగాయి. విఖ్రోలి ప్రాంతంలోనూ గుడిసెలపై కొండచరియలు పడి 10 మంది మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భండుప్ వద్ద కొండచరియలు పడి 16 ఏళ్ల బాలుడు మరణించాడు. ఆంధేరి షాప్ వద్ద 26 ఏళ్ల వ్యక్తి, కండివలి తూర్పు వద్ద 21 ఏళ్ల వ్యక్తి విద్యుత్ షాక్‌లతో మరణించారు. వర్షం కారణంగా తమ ఇంటిలో వస్తువులను తరలించే క్రమంలో వీరు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. నగరంలో అనేక ప్రాంతాల్లో మంచినీటి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారత వాతావరణ శాఖ ముంబయి నగరానికి రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. రానున్న ఐదురోజుల్లో నగరంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రధాని, ముఖ్యమంత్రి విచారం
భారీ వర్షాల కారణంగా ముంబయిలో మరణాలపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ 50 వేల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా పరిహారం ప్రకటించారు. మరణించిన వ్యక్తులకు కుటుంబాల ఒకొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. రాష్ట్ర పర్యావరణ మంత్రి అదిత్య ఠాక్రే ప్రమాద ప్రాంతాలను సందర్శించారు.










