39 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్టు నుంచి విరమిస్తున్నట్టు మూడ్రోజుల క్రితం చేసిన ప్రకటన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 'అయ్యో అప్పుడేనా' అన్న నిరుత్సాహ స్వరాలూ, 'ఇంకా ఆడితే బాగుణ్ణు' అన్న ఆశాభావాలూ దేశంలోనే కాదు; ప్రపంచవ్యాప్తంగానూ వినవస్తున్నాయి. తనదైన ప్రత్యేకమైన ఆట శైలితో క్రీడాభిమానుల గుండెల్లో ధోనీ నిర్మించుకున్న స్థానం అది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, క్రికెట్టు ముఖ్యమా, బతుకు తెరువు ముఖ్యమా అన్న సందిగ్ధం వెంటాడినప్పుడు- ధైర్యంగా క్రికెట్టునే ఎంచుకున్న క్రీడాస్ఫూర్తి ధోనీది. అపజయాలు ఎదురైనప్పుడు ఎంత శాంతంగా ఉన్నాడో, విజయాలు వరించినప్పుడూ అంతే ప్రశాంతంగా ఉన్న పరిణతి తనది. భారత క్రికెట్టు యవనికపై ఏదో వెలితి తారాడుతున్నప్పుడు- జార్ఖండ్ నుంచి డైనమైట్‌లా దూసుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. 2005లో విశాఖలో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సొగసైన షాట్లతో సెంచరీని సాధించి, క్రికెట్టు ప్రపంచంలో ఒక్కసారిగా మార్మోగిపోయాడు. ఆ తరువాత ఏ మ్యాచ్‌లోనైనా అతడొక విజయాస్త్రంగానే చూడబడ్డాడు. అభిమానుల అంచనాలను, ఆశలను అనేకసార్లు సాకారం చేశాడు కూడా! ఎన్నో స్మరణీయ విజయాలను అందించాడు. వ్యక్తిగతంగానూ, జట్టుపరంగానూ అనేక ఉత్సాహకర రికార్డులు నెలకొల్పాడు. ఎప్పుడో కపిల్‌దేవ్ సారథ్యాన సాధించిన ప్రపంచ కప్..గత ఘనతగా మిగిలిన తరుణంలో- 2011లో ఈ తరానికీ విజయాన్ని అందించి భారత పతాకాన్ని సగర్వంగా ఎత్తిచూపాడు.
ధోనీ ఆల్ రౌండర్‌గా రాణించాడు. వికెట్టు కీపరుగా, బౌలరుగా, బ్యాట్‌మేన్‌గా అనేక క్లిష్ట సందర్భాల్లో మెరుపులా ఆదుకొని, సమిష్టి విజయానికి కాడిని మోశాడు. జట్టు లోకి వచ్చిన తక్కువ కాలం లోనే సారథ్య బాధ్యతలు స్వీకరించి, ఆటను విజయ పథాన నడిపించాడు. ఆట ఏదైనా సరే జయాపజయాలతో సంబంధం లేకుండా సమిష్టి స్ప ృహ, సహకార ధోరణీ ప్రదర్శించటం చాలా ప్రధానం. ఏ ఆటగాడన్నా వ్యక్తిగత రికార్డుల కోసం వెంపర్లాడితే అది చాలాసార్లు ఉమ్మడి లక్ష్యాన్ని దెబ్బ తీస్తుంది. ధోనీ దగ్గర అలాంటి ధోరణి లేకపోవటం, అవసరాన్ని బట్టి తన స్థానాన్ని సైతం మరొక ఆవశ్య ఆటగాడికి వదిలివేయడం...ముఖ్య సందర్భాల్లో జట్టు రాణించటానికి మంచి జోడింపులయ్యాయి. ధోనీ గణుతికెక్కింది క్రికెట్టులో అయినప్పటికీ- ఇతర ఆటలూ అతడికి ఇష్టమే! పాఠశాల స్థాయిలో ఫుట్‌బాలే అతడి ఫేవరేట్. అనుకోకుండానే క్రికెట్టు టీమ్ లోకి మారాడు. చిన్ననాటి స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడటానికి ఇప్పటికీ మక్కువ చూపిస్తాడు. వాలీబాల్, బాడ్మింటన్‌లో కూడా మంచి ప్రావీణ్యమే ఉంది. షూటింగ్ కూడా మరొక ఇష్టం. క్రికెట్టు వైఫల్య సాఫల్యాలతో సంబంధం లేకుండా ఉపశమనానికీ, ఉత్సాహానికీ ఆ ఆటలనే ఆశ్రయించేవాడు ధోనీ. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులన్నా, వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసే రైతులన్నా గొప్ప అభిమానం. 2019 ప్రపంచ కప్ ముగిసిన తరువాత సైన్యంలో చేరి రెండు నెలల శిక్షణ తీసుకున్నాడు. సైనిక దుస్తులతోనే పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. రాంచీ లోని తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా పంటలు పండించటాన్ని కూడా ఆనందంగా ఆస్వాదిస్తాడు. క్రికెట్లో ధోనీ విజయాలు చాలా కాలం గుర్తుంటాయి. మూడు ఐఐసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్పులు సాధించిన సారథ్య ఘనత అతడిదే! 90 టెస్టు మ్యాచులూ, 350 వన్డేలూ, 98 టీ ట్వెంటీలలో- 21 వేల పరుగులూ, 16 శతకాలు, 131 అర్ధ శతకాలూ ఎమ్మెస్ ఖాతాలో ఉన్నాయి. వీటన్నిటికీ మించి క్రీడాస్ఫూర్తి గల మంచి ఆటగాడనే పేరు కోట్లాది అభిమాన హృదయాల్లో ఉంది. ఎన్ని ఒడుదుడుకులున్నా ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా క్రమబద్ధంగా నిర్మించుకున్న అతడి కెరీర్ స్ఫూర్తిదాయకం. ధోనీ ప్రస్థానంలో అంత వైవిధ్యం ఉంది కాబట్టే- అతడి బయోగ్రఫీ వెండితెరకు ఎక్కింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్‌హక్ అన్నట్టు- ''ఒక ఆటను ఎక్కడ ఎలా ముగించాలో తెలిసిన ఆటగాడు ధోనీ''. కొత్త నీరుకు తోవ ఇస్తూ- ఆటలో పాటించిన ఆ సూత్రాన్నే- ఆటకు వీడ్కోలు చెప్పటంలోనూ పాటించాడు. అతడి అనుభవమూ, నైపుణ్యమూ భారత జట్టుకు ఉపయోగపడాలని ఆశిద్దాం.










