యుపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మతాంతర వివాహాలపై దాడులకు దిగుతూ, సంఫ్‌ు పరివార్ కోరుకునే మనువాదం దిశగా రాష్ట్రాన్ని మళ్లించాలని చూస్తున్నారు. తద్వారా మత పరంగా ప్రజలను సమీకరించడమే గాక, మహిళల హక్కులను, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని హరించివేయాలని చూస్తున్నారు.
హిందూత్వ ఎజెండాను గట్టిగా అంటిపెట్టుకుని పనిచేసే యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో ఇతర బిజెపి ముఖ్యమంత్రుల కన్నా ముందుంటారు. ఆయన విద్యా, వైద్య రంగాలలో విజయాల గురించి గొప్పగా చెప్తారు. కానీ, ఈ విషయంలో ఆయన చేసిందేమీ లేదు. ముస్లింలను, దళితులను లక్ష్యంగాచేసుకుని మత సమీకరణలను తీవ్రతరం చేయడం, లక్షలాది మందిని వేధింపులకు గురి చేయడంలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎక్కడ లేని శ్రద్ధ చూపిస్తుంది. ఈ ప్రభుత్వ హాయంలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయి. మహిళల భద్రతకు పూచీ పడడానికి ఈ ప్రభుత్వం చేసింది శూన్యం.
ముఖ్యమంత్రి అయిన వెంటనే గోరక్షణ పేరుతో, జంతువుల వ్యాపారం, తోలు పరిశ్రమతో పాటు మొత్తం మాంస పరిశ్రమను నాశనం చేశారు. ముస్లింల జీవితాలు, వారి జీవనోపాధిని తీవ్రమైన దాడులకు గురి చేస్తూ, వందల సంఖ్యలో ముస్లింలను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేస్తున్నారు. అదే విధంగా జంతువులను అక్రమ రవాణా ద్వారా కబేళాలకు తరలిస్తున్నారనే నెపంతో ఇతర నేర చట్టాల కింద నిర్బంధిస్తున్నారు. ఫలితంగా లక్షల సంఖ్యలో దళితులు తోళ్ళ శుద్ధి కర్మాగారాలలో తమ ఉపాధిని కోల్పోయారు. తోళ్ళపరిశ్రమకు సంబంధించిన వారి చిన్న చిన్న వ్యాపారాలు బాగా చితికిపోయాయి. దానితోపాటు పాడి పరిశ్రమదారులు సంక్షోభంలో చిక్కుకున్నారు. మరో వైపు పెద్ద, పెద్ద మాంసం ఎగుమతి సంస్థలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వారి ఉత్పత్తులు, ఆదాయాలు వివిధ రకాలుగా పెరుగుతున్నాయి. ఆ సంస్థల యజమానులు బీజేపీ నాయకులే.
ముస్లింలు, హిందువుల మధ్య జరిగే మతాంతర వివాహాలపై ఆదిత్యనాథ్ అసహనం ప్రదర్శించారు. 2017 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి అయిన వెంటనే మతాంతర వివాహాలపై గుడ్లురిమారు. కొన్ని రోజుల వ్యవధిలోనే, 'హిందూ యువ వాహిని' కి చెందిన తన ప్రైవేట్ సైన్యం మీరట్ లో మతాంతర వివాహం చేసుకున్న ఒక జంటపై కాషాయ మూకలు దాడి చేశారు. మే 2న బులంద్‌షహర్‌లో ముస్లిం యువకుడితో హిందూ యువతి లేచిపోతే, ఈ సంఘటనతో ఏమ్రాతం సంబంధం లేని ఒక ముస్లింను కాషాయ మూకలు హత్య చేశాయి. తాము ఏం చేసినా శిక్ష పడడదనే భరోసాతోనే వారు ఇంతగా చెలరేగిపోయి ఉండొచ్చు. తరువాత, ఒక రోజు కాన్పూర్ నుండి పెద్ద సంఖ్యలో మతాంతర వివాహాలు జరిగినట్లు సమాచారం రావడంతో ఆదిత్యనాథ్ ఆగ్రహంతో ఊగిపోయారు. 'లవ్ జీహాద్'ను కఠినంగా అణచివేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే కొన్ని హిందీ పత్రికలు రంగంలోకి దిగి ఈ మతాంతర వివాహాల వెనుక ఐఎస్‌ఐ ప్రమేయం ఉందని, విదేశాల నుంచి హవాలా మార్గం నిధులు వస్తున్నాయంటూ కట్టు కథలల్లాయి. డబ్బుతో ప్రలోభపెట్టి హిందూ మహిళలను ముస్లింలు పెళ్లి చేసుకుంటున్నారంటూ రెచ్చగొట్టేలా వ్యాసాలు రాశాయి. వెంటనే బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. పాలనా యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి వల్లే ఇవి జరుగుతున్నాయని ఆరోపించింది. సెప్టెంబర్‌లో అలాంటి 14 మతాంతర వివాహాలపై విచారణ జరపాలని ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. నవంబర్ లో దానిపై నివేదిక అందజేసిన తరువాత పోలీస్ ఐజీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ''లవ్ జిహాద్'' కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదని ప్రకటించాడు.
ఈ క్రమంలో, సెప్టెంబర్ 24 న అలహాబాద్ హైకోర్టు జస్టిస్ త్రిపాఠి, ఒక ముస్లిం మహిళ హిందూ మతంలోకి మారిన తర్వాత మతాంతర వివాహం చేసుకున్న కేసులో ఒక విచిత్ర మైన తీర్పు చెప్పాడు. ఆ జంట తమకు రక్షణ కల్పించాలని న్యాయస్థానానికి వెళ్లింది. అయితే, జస్టిస్ త్రిపాఠి వారి విజ్ఞప్తిని పూర్తిగా వినకుండా, పెళ్లి కోసం మత మార్పిడిని అంగీకరించడం కుదరదని, కాబట్టి ఈ పెళ్లికి విలువ లేదని తీర్పు చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సంబంధాన్ని సంఫ్‌ు పరివార్ ప్రోత్సహిస్తుంటే , ఆదిత్యనాథ్ మాత్రం బహిరంగ సభల్లో, హిందూ మహిళలతో సంబంధం పెట్టుకునే వారిని అరెస్ట్ చేస్తామని, చంపుతామని బెదిరించారు. యాదచ్ఛికంగా, తరువాత నెల రోజుల లోపే, అదే హైకోర్టుకు సంబంధించిన ఇతర జడ్జీలు జస్టిస్ త్రిపాఠి చెప్పిన తీర్పుకు భిన్నమైన తీర్పులు చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక స్వలింగ సంపర్క జంట కోర్టు కు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని, వారి సంబంధం పూర్తిగా చట్ట సమ్మతమని, వారికి పాలనా యంత్రాంగం, పోలీసులు రక్షణ కల్పించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 11వతేదీన, మతాంతర వివాహం చేసుకున్న ఒక జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇద్దరు జడ్జీల బెంచ్ జారీచేసిన ఒక సమగ్రమైన ఆజ్ఞ ఈ విధంగా ఉంది:
''మేము ప్రియాంక ఖర్వార్, సలామత్ లను హిందూ, ముస్లింలుగా చూడడం కన్నా ఎదిగిన ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టప్రకారం, సంతోషంగా, ప్రశాంతంగా కలిసి జీవించాలని అనుకుంటున్నారనేది చూస్తున్నాం. న్యాయస్థానాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి తన జీవితాన్ని, స్వేచ్ఛగా గడిపే హక్కును సమర్దిస్తాయి. అతడు/ఆమె ఇష్ట ప్రకారం ఏ వ్యక్తితో నైనా (మతానికి సంబంధం లేకుండా) జీవించే హక్కును కల్పించడం అంటే అంతర్గతంగా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను పొందే హక్కును కలిగి ఉండడమే''.
రాజ్యాంగ నిబంధనలు ఏవీ ఆదిత్యనాథ్‌కు పట్టవు. ఆయన, తన సంఫ్‌ు పరివార్‌లు అత్యంత హేయమైన నేరాలుగా పరిగణించే మత మార్పిడి (హిందూ మతం నుండి ఇతర మతాలకు), హిందూ మహిళలు, ముస్లిం పురుషుల మధ్య జరిగే మతాంతర వివాహాలపై దాడి చేయడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఇందుకనుగుణంగా ఒక ఆర్డినెన్సు కూడా తెచ్చారు. ఆర్డినెన్సును తీసుకొని రావడానికి ముందే మతాంతర వివాహాలు చేసుకున్న వారితో పాటు ప్రస్తుతం మతాంతర వివాహాలు చేసుకునే వారిని కూడా వర్ణనాతీతమైన బాధలకు గురి చేస్తున్నారు. మతాంతర వివాహాలు చేసుకున్న జంటల పైన తీవ్రంగా విరుచుకుపడు తున్నారు. ముస్లిం మతానికి చెందిన పురుషులు, వారి బంధువులపై చెయ్యి చేసుకుంటూ, వారిని జైళ్ళకు పంపు తున్నారు. అలాంటి అనాగరిక చర్యలకు గర్భిణి స్త్రీలు గురై, గర్భ స్రావం ద్వారా బిడ్డలను కోల్పోయారు. వీధుల్లో బంధువులు ఈడ్చుకుంటూ తీసుకొని వస్తున్న మహిళలు, కొట్టుకుంటూ, తన్నుకుంటూ ఈడ్చుకొని తీసుకొస్తున్న యువకుల చిత్రాలు తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి.
వర్ణాశ్రమ ధర్మాన్ని తన ఆదర్శవంతమైన సామాజిక ఏర్పాటుగా సంఫ్‌ు పరివార్ అంగీకరిస్తుంది. కానీ 'తక్కువ' కులానికి చెందిన హిందువులు మిలియన్ల సంఖ్యలో ఇస్లాం, క్రిస్టియన్ మతాలను స్వీకరించడానికి సంఫ్‌ు బాధ్యత వహించడాన్ని, వివేకానందుడు కూడా గుర్తించి, చాలా తీవ్రంగా విమర్శిం చాడన్న చారిత్రక సత్యాన్ని సంఫ్‌ు పరివార్ ఖండిస్తుంది.
''మహిళలు ఎల్లవేళలా పురుషుని అదుపులో ఉండాలి, ఆస్తిపై వారికి ఏ విధమైన అదుపు ఉండ కూడదు, సరియైన నిర్ణయాలు చేయలేరు కాబట్టి వారిని పరిమితులలోనే ఉంచాలి'' అని మనుస్మృతి మనకు బోధిస్తుంది.
మనువాదం పట్ల సంఫ్‌ు పరివార్ నిబద్ధతకు ఆదిత్యనాథ్ గట్టి మద్దతుదారుడు. అందుకే ఉత్తరప్రదేశ్ లో మహిళల హక్కులు, జీవనోపాధి, భద్రతపై క్రూరమైన దాడులు పెరిగిపోతున్నాయి. .ప్రజాస్వామిక హక్కులు, కార్మిక, కర్షక హక్కులపై జరిగే దాడుల తీవ్రత కొనసాగుతూనే ఉంది.
(ది వైర్ సౌజన్యంతో)

- సుభాషిణీ ఆలీ










