Dec 25,2020 07:06

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం 'లవ్‌ జిహాద్‌ ప్రమాదాన్ని' అధిగమించేందుకు ఒక ఆర్డినెన్సును ఆమోదించింది. అది ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. కులాంతర, మతాంతర పెళ్ళిళ్ళను ప్రోత్సహించేందుకు, నూతన వధూవరులకు రూ.50 వేల నగదు ప్రోత్సాహకాలను అందజేసే పథకం ఒకటి ఉంది. కొన్ని సంవత్సరాలుగా అది అమలులో వున్నప్పటికీ, ఇప్పుడు వెలుగు లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ లో కూడా ఆ పథకం అమలులో వుంది.


ఉత్తరప్రదేశ్‌ నుండి ఉత్తరాఖండ్‌ 2000 సంవత్సరంలో విడిపోయినప్పుడు కూడా నాటి ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తేరీగర్వాల్‌ కు చెందిన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఒకరు ఇటీవల ఈ పథకం గురించి తెలియజేస్తూ, ఒక వార్తను పత్రికలకు విడుదల చేశారు. హిందూత్వ భావజాలాన్ని అమలు చేస్తూ, ఈ పథకాన్ని రద్దు చేయాలని యోచిస్తున్న ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి మద్దతుదారైన రావత్‌ ప్రభుత్వం, ఆ అధికారి విడుదల చేసిన వార్త పట్ల ''అసహనాన్ని'' వ్యక్తం చేసింది. బిజెపి పాలిత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ లో కూడా పెళ్ళిళ్ళ కోసం జరిగే మత మార్పిళ్లతో పాటు మామూలు మత మార్పిడికి కూడా వ్యతిరేకమైన చట్టాలు ఉన్నాయి.


నగదు ప్రోత్సాహక పథకం ప్రచారం కోసం విడుదల చేసిన వార్తపై విచారణకు కూడా రావత్‌ ప్రభుత్వం ఆదేశించింది. కానీ మతాంతర వివాహాలు చేసుకున్న వారు చాలా నిరాశ చెందు తున్నారు. 'రావత్‌ ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తీరు, ఇతర మతాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవడం నేరమని ప్రతి ఒక్కరూ భావించే విధంగా ఉంది. ముప్పై సంవత్సరాలు నా దేశానికి సేవ చేసిన తర్వాత, దీనిని ఒక అవమానంగా భావిస్తున్నా''నని ముస్లిం మహిళను వివాహం చేసుకున్న ఆర్మీ విశ్రాంత అధికారి ఒకరు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


ఈ కొత్త చట్టాన్ని బిజెపి పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్‌, హర్యానాతో పాటు అస్సాం కూడా అమలు చేయాలని చూస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ఆర్డినెన్సులో ''పెళ్లి చేసుకోవడం కోసం'' మతం మారాలంటే పెళ్లి తేదీకి రెండు నెలల ముందు జిల్లా మెజిస్ట్రేట్‌ అనుమతి అవసరం. ఈ మత మార్పిడి బలవంతంగా గానీ, మోసపూరితమైన పద్ధతిలో గానీ జరగడం లేదని రుజువు చేసే బాధ్యత...మతం మారాలని అనుకునే వ్యక్తిదే. లేకుంటే ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ లలో కూడా ఇదే విధమైన చట్టం వుంది.


ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్డినెన్సు ప్రకారం, తప్పుడు సమాచారంతో, ఒత్తిడి చేసి, మితిమీరిన ప్రాబల్యంతో, బలవంతంగా, ఎర చూపి, మోసపూరితమైన మత మార్పిడికి పాల్పడిన వారిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి, ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తారు. ఒకవేళ ఆ మహిళ పెళ్లి సమయంలో మైనర్‌ అయి, ఎస్‌సి, ఎస్‌టి కులాలకు చెంది వుంటే, అప్పుడు 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తారు. ''మూకుమ్మడి మత మార్పిళ్లు'' చేసే సంస్థ పైన తప్పును నిర్ధారిస్తూ, 3 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారు.


మతాంతర వివాహాల చుట్టూ వక్రీకరించిన కథనం తీరు పట్ల...ఉత్తరాఖండ్‌లో దేవాలయ పూజారి కూతురైన విశ్రాంత ఉపాధ్యాయిని ఒకరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో మత సంస్థలు, ముస్లింను పెళ్లి చేసుకోకుండా తనను ఏ విధంగా నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాయో గుర్తుచేసుకున్నారు. కానీ ఆ పని చాలా మర్యాదగా, వ్యూహాత్మకంగా చేసే వారనీ, నేడు మనం ఎదుర్కొంటున్న విధంగా, భయంకరమైన ముస్లిం వ్యతిరేక ప్రచారం వుండేది కాదని ఆమె పేర్కొన్నారు.


ఉత్తరాఖండ్‌కు బయట ఉన్న ప్రాంతాల్లో మతాంతర వివాహాలు చేసుకున్న వారి భావనలు ఆ విధంగా వున్నాయి. తమ పిల్లల గురించి సామాజిక మాధ్యమాల్లో అవమానకరమైన, తప్పుడు సమాచారాన్ని ఇస్తారన్న భయంతో తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ, తమ పేర్లను బయట పెట్టవద్దని కోరుకుంటున్నారు. అదే విధంగా రాజధానిలో నివసించే ముస్లింను పెళ్లి చేసుకున్న ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఇలా అంటున్నారు. ''ప్రముఖ టీవీ ఛానెళ్లలో ప్రతి రోజు రాత్రి ముస్లింలకు వ్యతిరేకంగా ఆగ్రహావేశంతో చేస్తున్న మోసపూరిత ప్రసంగాలను విని భయపడుతున్నాం. నేను, నా భర్త టెలివిజన్‌ ఉద్యోగులుగా జీవితాన్ని ప్రారంభించాం. అందువలన, మాకు లవ్‌ జిహాద్‌ గురించి చేసే ప్రచారం వాస్తవానికి చాలా దూరంగా ఉంటుందనే విషయం తెలుసు. కాబట్టి, మాకు అది అస్సలు సమ్మతం కాద''ని పేర్కొన్నారు. ఆమె భర్త, కుటుంబ సభ్యులు అందరూ దాదాపు ఏదో ఒక వృత్తిలో వున్నారు. అతని తండ్రి ఐఏఎస్‌ అధికారి. అందువలన లౌకిక భావాలు నిండిన వాతావరణంలో పెరిగిన విషయం కూడా ఆయనకు గుర్తుంటుందని ఆమె చెప్తున్నారు.


కానీ ఈ ప్రొఫెసర్‌ పుట్టింట్లో పరిస్థితులు భిన్నంగా వుండేవి. ''నా తండ్రి ఆర్‌ఎస్‌ఎస్‌ క్రియాశీలక కార్యకర్త. ప్రతీ రోజు ఉదయం టిఫిన్‌ తినే సమయంలో ముస్లిం వ్యతిరేక తిట్ల దండకం మొదలుపెట్టే వారు. కానీ ఆయన కూడా ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా నేడు మాట్లాడుతున్న భాషకు భిన్నంగా, వినదగిన భాషనే మాట్లాడేవారని'' ఆమె అంటున్నారు. ముస్లిం వ్యక్తితో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని తెలుసుకున్న ఆమె తండ్రి ''విస్మయం'' చెందారు. ఆమెతో రెండేళ్లు మాట్లాడలేదు. పెళ్ళికి తండ్రి హాజరవ్వాలన్న పట్టుదలే, నాడు డిప్యూటీ ప్రధానిగా ఉన్న అద్వానీ జోక్యాన్ని ఆమె కోరాల్సి వచ్చిందని చెప్పారు.


యుక్త వయస్కురాలైన వీరి కుమార్తె చిన్నప్పట్నుంచి రెండు మతాల గురించిన వాస్తవాలను తెలుసుకుంది. ఆమెకు ఇస్లాం, హిందూ మతాలకు సంబంధించిన మౌలిక విషయాలను ప్రొఫెసర్‌ చెప్పారు. ప్రొఫెసర్‌ బెంగాలీ కాబట్టి, వారి కుటుంబం దుర్గా పూజతో పాటు అన్ని పండుగలను జరుపుకుంటారు. ''రంజాన్‌ మాసంలో నేను కొన్ని రోజుల పాటు ఉపవాసం వుంటాను. కానీ నేను మతం మార్చుకోవాలని ఎవరూ, ఎటువంటి ఒత్తిడి చేయలేదని'' చెప్పారు. కానీ ఇప్పుడు తన కూతురు గురించి భయపడుతున్నారామె. అమ్మాయి చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లి, అక్కడ స్థిరపడి పోవడమే తనకు ఇష్టమని ప్రొఫెసర్‌ చెప్తున్నారు.


మతాంతర వివాహం చేసుకున్న నిరుపేదలకు పెద్దగా ఎంపిక అవకాశాలు వుండవు. ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న హిందూ యువకుడు, తమ లాంటి మతాంతర పెళ్ళిళ్లు చేసుకున్న వారి భవిష్యత్తు అంత ప్రోత్సాహకరంగా వుండదని నమ్ముతాడు. ''నా భార్య నాతో పాటుగా గుడికి వస్తుంది. ఒక హిందూ మహిళ లాగే జీవనం సాగిస్తుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులను గుడికి వెళ్ళమని ప్రోత్సహించం. ఎందుకంటే అది శత్రు భావనను కలిగిస్తుంది'' అంటాడతను.


''లవ్‌ జిహాద్‌'' అనేది ముస్లింలను ప్రమాదకారులుగా చూపించే ఒక ప్రభుత్వ విధాన కొనసాగింపని రాజకీయ వ్యాఖ్యాత ఎస్‌ఎంఎ కజ్మీ అభిప్రాయపడ్డారు. ''ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో రెండు సంవత్సరాలలో ఎన్నికలు జరగనున్నాయి. రామ మందిరం అంశం ఓట్లు తెచ్చిపెట్టే అవకాశం లేదు. నిరుద్యోగం, నేరాల పెరుగుదల, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు మిలియన్ల సంఖ్యలో ప్రజలను దిక్కు లేని వారిని చేసింది. కాబట్టి మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి రెండు మతాలను విభజించి, హిందూ ఓట్లు దండుకునేందుకు లవ్‌ జిహాద్‌ తగిన ఆయుధంగా పాలకులు భావిస్తున్నారని'' ఆయన అన్నారు.


హిందూ మహిళలను ఇస్లాం మతస్థులుగా మార్చేందుకు, ముస్లింలు తమను పెళ్లి చేసుకొమ్మని వెంటపడుతున్నట్లు విస్తృత ప్రచారం ద్వారా అందరిని నమ్మిస్తున్నారు. హిందూ స్త్రీల ''గౌరవం'' ముస్లింల వలన ప్రమాదంలో పడినట్లు వారు నమ్ముతున్నారు. వ్యక్తిగత గౌరవం, ''హిందూ మతానికి ఒక సవాల్‌''గా మారింది. అనేక రాజకీయ పార్టీలు, వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించే కొత్త, ప్రతిపాదిత చట్టాలపై మౌనంగా వున్నాయి.


మొత్తం లవ్‌ జిహాద్‌ అనే భావన బలహీనమైన పునాదులపై ఆధారపడి ఉంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, కాన్పూర్‌లో 11 ''లవ్‌ జిహాద్‌'' కేసులను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేసింది. తమ పెళ్ళిళ్ళలో ''లవ్‌ జిహాద్‌''కు సంబంధం వుందన్న తప్పుడు భావనను అనేక కేసుల్లో మహిళలు కొట్టిపారేశారు. మూడు కేసులలో పెళ్లికి ముందు పురుషులు తమ గుర్తింపును దాచారన్న ఆరోపణలు ఉన్నాయి. ''కేవలం మూడు కేసుల కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం కోట్ల మంది ప్రజల జీవితాలపై ప్రభావం చూపే ఆర్డినెన్సును తీసుకొని రావడం అసాధారణంగా కనిపిస్తుందని'' కజ్మీ అన్నారు.


ఇది మాత్రమే కాదు. గత సంవత్సరం, పార్లమెంట్‌లో ఒక కేంద్ర మంత్రి, దేశంలో ప్రధానమైన పరిశోధన ఏజెన్సీ, ఒక్క 'లవ్‌ జిహాద్‌' కేసును కూడా గుర్తించలేదని ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌, పెద్ద సంఖ్యలో జరిగే '' మత మార్పిడుల'' కారణంగా అటువంటి ఒక చట్టం అవసరం అని గట్టిగా పట్టుపట్టారు.


ఉత్తరప్రదేశ్‌ మాజీ డిఐజి వి.ఎన్‌.రారు చెప్పినదాని ప్రకారం, హిందూ, ముస్లిం మతాల మధ్య పెంచిన అపనమ్మకం, ద్వేష భావానికి సంబంధించిన కథనాలను నేడు కొద్ది సంఖ్యలో వున్న మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు అధిగమించలేరు.


''వారి మధ్య ఉన్న పరస్పర అనుమానం, అపనమ్మకాన్ని తెలియజేసే సమాచారం కావలసినంత అందుబాటులో ఉంది. అదలా కొనసాగుతుంద''ని ఆయన అన్నారు. ''ఎక్కడ ప్రేమ వుంటుందో, అక్కడ జిహాద్‌ అవసరం ఉండదని'' సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ అధిపతి, డా|| రంజనా కుమారి అభిప్రాయపడ్డారు. ఆమె ఈ కొత్త చట్టాలను రాజకీయ ప్రేరేపితమనీ, పురుషాధిక్యత భావన కలిగి ఉండే, సమాజ వ్యతిరేకమైన, పితృస్వామిక చట్టాలుగా గుర్తించాలన్నారు. సంఫ్‌ు పరివార్‌ సృష్టించే కొన్ని ఊహాజనితమైన విషయాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్సులను, చట్టాలను తీసుకు రావడం విచిత్రంగా వుంది. చట్టపరమైన గుర్తింపు లేని ఒక పదం (లవ్‌ జిహాద్‌), ఒక చట్టం చేయడానికి ఆధారంగా మారింది.
                                                          * రష్మీ సెహగల్‌ ('న్యూస్‌ క్లిక్‌' సౌజన్యంతో)