Dec 24,2022 13:15

ప్రజాశక్తి-కడియం : ఎన్నో రకాల కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ప్రేమోన్మాది విచక్షణా రహితంగా జరిపిన దాడిలో యువతితో పాటు ఆమె తల్లి, సోదరుడు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్‌ మూడు రోజుల క్రితం కడియపులంక గ్రామానికి చెందిన యువతి తండ్రికి ఫోన్‌ చేసి బెదిరించాడు. ''మీ రెండో కుమార్తెను ప్రేమించాను.. నాతో పెళ్లి చేయాలి. లేదంటే మీ అమ్మాయిని చంపేస్తా'' అని యువతి తల్లిదండ్రులను హెచ్చరించాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన వెంకటేశ్‌.. యువతి తలపై సుత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లి, సోదరిపైనా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం వెంకటేశ్‌ తన గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఉన్మాది దాడిలో గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తిలక్‌, ఎస్సై అమీనా బెగం తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం క్రింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఎమ్మెల్యే జక్కంపూడి పరామర్శ
యువతిపై జరిగిన దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రూరల్‌ కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఉన్మాదిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.