Feb 18,2022 07:00

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 నాటి అంచనాల ప్రకారం మాత్రమే నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం దారుణం. రాష్ట్ర పునర్నిర్మాణ (విభజన) చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నందున పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టాలని, పర్యావరణ, అటవీ అనుమతులతోపాటు పునరావాస పునర్నిర్మాణానికి సంబంధించిన అనుమతులను సంపాదించడం దాని బాధ్యతేనని విభజన చట్టం సెక్షన్‌ 90(4) స్పష్టంగా పేర్కొంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిపిస్తామంటూ నిర్మాణ బాధ్యతలను నాటి తెలుగుదేశం ప్రభుత్వం నెత్తికెత్తుకుంది. కేంద్రప్రభుత్వం తొలుత సాఫీగా అనిపించినా కొంత కాలం తరువాత రాష్ట్ర ఖజానా నుండి ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్‌ చేయడానికి కొర్రీలు వేస్తూ వచ్చింది. కేంద్ర డిజైన్ల నిపుణులు చెప్పిన మేరకు నిర్మాణంలో మార్పులు చేసి, ఆ మేరకు సవరించిన అంచనా మొత్తాలు చెల్లించాలంటూ బిల్లులు సమర్పిస్తే మేం 2014 నాటి అంచనాల ప్రకారమే రీయింబర్స్‌ చేస్తామంటూ పోలవరం అథారిటీ వివాదాస్పదం చేస్తోంది. ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులను కేంద్రం గాలికొదిలేస్తోంది. ప్రాజెక్టు పనులు జరుగుతున్నకొద్దీ వారికి ముంపు ప్రమాదం పెరుగుతుంది. వరద ముంచుకొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వారు చెట్టుకొకరు పుట్టకొకరు పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిర్వాసితుల పునరావాసం, పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం వెంటనే ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టం (2013) ప్రకారం పారదర్శకంగా పరిహారాలు చెల్లించడం, పునరావాస పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయడం అవశ్యం.
    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మంజూరు విషయంలోనూ బిజెపి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014 ఎన్నికల్లో హామీనిచ్చిన ప్రధాని మోడీ రెండేళ్లు తిరిగాక దానికి తిలోదకాలిస్తూ 'హోదా కాదు ప్రత్యేక ప్యాకేజి' అన్నారు. అది మసి పూసి మారేడుకాయ చేయడమేనని ఆంధ్ర దేశం భగ్గుమంది. బిజెపి కి 2019 ఎన్నికల్లో దేశమంతటా ఓట్లు, సీట్లు పెరిగినా ఎ.పి లో మాత్రం జనం మట్టి కరిపించారు. ప్రజల మనసుల్లో బలంగా నాటుకున్న ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తెస్తూ ఫిబ్రవరి 17 వివాద పరిష్కార సబ్‌ కమిటీ సమావేశ ఎజెండాలో కేంద్ర హౌం శాఖ ఫిబ్రవరి 12న ప్రతిపాదించింది. ఆ వెంటనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు ఒక బృందాన్ని వెంటబెట్టుకొని హోం శాఖ ఉన్నతాధికార్లపై ఒత్తిడి చేసి సాయింత్రానికల్లా హోదా, ఆదాయ లోటు భర్తీతో సహా నాలుగు అంశాలను ఎజెండా నుండి తొలగింపజేశారని వైసిపి ఎం.పి మార్గాని భరత్‌ తీవ్రంగా విమర్శించారు. ఎ.పి కి ప్రత్యేక హోదా విషయం కమలనాథులకు ఎంత కంటగింపుగా ఉందో దీనినిబట్టి విదితమవుతోంది. పైపెచ్చు 'హోదా అడుగుతున్నారు... ప్యాకేజి కింద ఇచ్చిన నిధులు రాష్ట్రం తిరిగి ఇచ్చేస్తుందా' అని బిజెపి నేతలు ఎదురు ప్రశ్నించడం జుగుప్సాకరం. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని పార్లమెంటులో ప్రధాని మొసలి కన్నీరు కార్చిన మూడు రోజులకే ఇదంతా సాగడం బిజెపి వంచనకు నిలువెత్తు నిదర్శనం.
    పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్ర ఆదాయ లోటు భర్తీ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో అవగాహనకు వచ్చినట్లు ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా వైసిపి నాయకులు ఢిల్లీలో ప్రకటించారు. ఆ తరువాత పోలవరం నిధులు, ప్రత్యేక హోదా అంశాలలో ఈ వివాదం రేగిందంటే అసలు కుదిరిన ఆ అవగాహన ఏమిటో రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత వైసిపి నేతలపై ఉంది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష. దాన్ని సాకారం చేసే దిశలో కృషి చేయడానికి ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం జరపాలి. అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలూ ఐక్యంగా ఉద్యమించి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలి. శక్తివంతమైన ఐక్య ప్రజా ఉద్యమం ద్వారానే అది సాధ్యం.