Jul 18,2021 17:12

కాన్పూర్‌ : ఓ మహిళను కింద పడేసి ఎస్‌ఐ దారుణంగా కొట్టాడు. మహిళ అని కూడా చూడకుండా ఆమె పట్ల ఎస్‌ఐ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ డెహత్‌ జిల్లా దుర్గాదాస్‌పూర్‌ గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంది. అయితే, తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడద వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్‌ఐని సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ వ్యక్తిని భోగిన్‌పూర్‌ ఎస్‌ఐ మహేంద్ర పటేల్‌ అరెస్టు చేశాడు. అయితే, ఆయనను విడిచిపెట్టాలంటే లంచం ఇవ్వాలని అడుగుతున్నారని అతని భార్య ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆమెను ఎస్‌ఐ కొట్టాడు. ఆమెను కిందపడేసి, ఆమె మీద కూర్చుని బాదాడు. చివరకు స్థానికులు ఆ ఎస్‌ఐని అడ్డుకోవడంతో విడిచిపెట్టాడు. ఇదిలా ఉండగా, స్నేహితులతో కలిసి శివం యాదవ్‌ అనే వ్యక్తి జూదం ఆడుతున్న కారణంగానే తాము అరెస్టు చేశామని ఎస్‌ఐ చెబుతున్నాడు. అరెస్టు చేయకుండా అతని భార్య ఆర్తి, తల్లి తమను అడ్డుకోవాలని ప్రయత్నించి, తమపై దాడి చేశారని చెప్పాడు. కాగా, ఇప్పటికే ఎస్‌ఐ పటేల్‌ను భోగిన్‌పూర్‌ విధుల నుంచి తప్పించామని ఉన్నతాధికారులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

https://twitter.com/i/status/1416468649041219584