Mar 25,2023 20:59

మహిళలకు చెక్‌ను అందజేస్తున్న జెసి, జడ్పీ చైర్మన్‌

రాయచోటి : వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం మహిళలకు వరం లాంటిదని జెసి తమీమ్‌ అన్సారీయా అన్నారు. ఆసరా పథకం కింద 3వ విడత జిల్లాలోని డిఆర్‌డిఎ, మెప్మా పరిధిలోని 24,915 డ్వాక్రా సంఘాలకు రూ.223.56 కోట్లు జమ చేశామన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో మహిళా సంఘాలకు వైయస్సార్‌ ఆసరా పథకం 3వ విడత రుణమాఫీ-స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ఎల్‌ఇడి స్క్రీన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో జెసి అన్నారీయా, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్‌ అకేపాటి అమర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల లబ్ధిదారులకు రూ.223.56 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం 3వ విడతకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో డీఆర్డీఏ మరియు పట్టణ ప్రాంతాల్లోని మెప్మాలో జిల్లా మొత్తం 24,915 సంఘాలకు చెందిన 2,33,293 మంది మహిళలకు ఖాతాల్లో రూ.223.56 కోట్లు జమ చేశామన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం 3వ విడతకు సంబంధించి డిఆర్‌డిఎ నుంచి 22,214 స్వయం సంఘాల్లోని 2,08,174 మంది సభ్యులకు రూ.198.515 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని మెప్మా పరిధిలో ఉన్న 2701 సంఘాల్లోని 25,119 మంది మహిళలకు రూ.24.49 కోట్లు జమ చేశామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వైయస్సార్‌ ఆసరా పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందన్నారు. మహిళాభివద్ది ద్వారానే కుటుంబాభివ ద్ది జరుగుతుందనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, పేదింటి ఆడపిల్లలలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే మనబడి నాడు-నేడు, ఇళ్ళ పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇలా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జడ్పీ చైర్మన్‌ అకేపాటి అమర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ప్రతి మహిళ స్వయం సమద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, అతివలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జగనన్న తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 3వ విడత పొదుపు సంఘాల మహిళల ఖాతాలలో జమ చేయడం పై మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. అమూల్‌ వంటి గొప్ప సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పాల ఉత్పత్తులను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ విధంగా హామీలు నెరవేర్చి, మహిళల ఆర్థికాభివ ద్ధికి చర్యలు చేపట్టడం దేశ చరిత్రలోనే జగనన్న రికార్డ్‌ సాధించారన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, ఎల్‌డిఎం వెంకటేశ్వర్‌రెడ్డి, డిపిఎం లక్ష్మీప్రసాద్‌, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు మైతిలి, రాయచోటి ఇన్‌ఛార్జి ఎంపిడిఒ, డిఆర్‌డిఎ, మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.