ప్రజాశక్తి-అచ్యుతాపురం : త్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రజా పోరాటాలతో కాపాడుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్ పిలుపునిచ్చారు. సిపిఎం చేపట్టిన ఉక్కు రక్షణ యాత్ర బైక్ ర్యాలీ బుధవారం అచ్యుతాపురం చేరుకుంది. ఈ సందర్భంగా అచ్యుతాపురం జంక్షన్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బతీయడానికి సొంత గనులు ప్రభుత్వం కేటాయించడంలేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు మోడీ ప్రభుత్వ కుట్రలు పోరాటాలతో అడ్డుకోవాలన్నారు. నరేంద్రమోడీ దగ్గర భజన చేయడం తప్ప స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడగడం లేదన్నారు. టిడిపి, జనసేన స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మోడీపై ఒత్తిడి తేవడం లేదన్నారు. అధికారం ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాలి తప్ప కోట్లు సంపాదించడానికి కాదన్నారు. ప్రభుత్వ పరిశ్రమలు ప్రయివేటీకరిస్తే రిజర్వేషన్లు అమలుకావని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం మాట్లాడుతూ సెజ్ లో పరిశ్రమల్లో భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ సభలో సిపిఎం అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము, పార్టీ నాయకులు సోమినాయుడు, సదాశివ రావు, కర్రి అప్పారావు, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.










