Oct 04,2023 17:35

ప్రజాశక్తి-విజయవాడ : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర బిజెపి ప్రభుత్వవైఖరికి నిరసనగా సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఉక్కు రక్షణ యాత్ర ముగింపుసభ అక్టోబర్‌ 5వ తేదీన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌గేట్‌ (కూర్మన్నపాలెం జంక్షన్‌) వద్ద జరుగుతుందని పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ ముగింపుసభలో సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మరియు ఇతర ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసే విధంగా ఈ సభలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపియం కోరింది. 
    సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 20న విశాఖ జివిఎమ్‌సి గాంథీ విగ్రహం వద్ద ప్రారంభమై పార్టీ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు కె.లోకనాథం నాయకత్వంలో ఈ బైక్‌యాత్ర 52మంది కార్యకర్తలతో నడిచింది. ఈ యాత్ర 6 జిల్లాలలో సుమారు 1500 కిలోమీటర్లు, 12 రోజులపాటు సాగింది. 150 సెంటర్లలో జరిగిన సభలలో సుమారు 30 వేలమంది ప్రజలు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ బైక్‌యాత్రకు సంఫీుభావంగా వందల సంఖ్యలో బైకులతో ప్రజలు పాల్గొన్నారు. మొత్తంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి నిరసన వ్యక్తమయింది. బైక్‌యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది.