Feb 16,2023 21:32

నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-నెల్లూరు :నగరంలోని రాజేంద్రనగర్‌ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ పరిధిలో విధి నిర్వహణలో భాగంగా బిల్లు చెల్లించలేదన్న కారణంగా విద్యుత్తు సరఫరాను నిలిపివేసేందుకు వెళ్లిన బి.హరిప్రసాద్‌ అను లైన్‌మెన్‌ పై మోహన్‌బాబు అను వినియోగదారుడు దాడికి పాల్పడటం అమానుషమని, దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సిబ్బందికి భద్రత కల్పించాలని యుఇఇయు జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. గురువారం ఈ ఘటనను నిరసిస్తూ నగరంలోని పలు విద్యుత్తు సబ్‌స్టేషన్‌ కార్యాలయాల ఎదుట ఉద్యోగులు, కార్మికులు లైన్‌మెన్‌ హరిప్రసాద్‌ రావుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యుఇఇయు రాష్ట్ర అధ్యక్షులు దుగ్గిరాల సూరిబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఒక ఉద్యోగిపై వినియోగదారుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు స్పందించి ఉద్యోగినికి న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నగరాన్ని అంధకారం చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు.కాంట్రాక్టు కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుమన్‌ మాట్లాడుతూ ఉద్యోగిపై దాడి జరగటం అనేది సంస్థకు అవమానకరమన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఒక్క సారి అధికారులు ఆలోచన చేయాల్సి ఉంటుందన్నారు. యుఇఇయు నగర అధ్యక్ష, కార్యదర్శులు హరినారాయణ, నాగయ్య, పలు సంఘాల నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.