ప్రజాశక్తి-అమరావతి : కొత్త డీఎస్సీని ఇంకెప్పుడు ప్రకటిస్తారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు శాసనమండలిలో ప్రశ్నించారు. కనీసం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని సభను కోరారు. రెండో రోజు ప్రారంభమైన శాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఏపీలో 40వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారని తెలిపారు. కానీ మంత్రి బొత్స కేవలం 8వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారని, ఇది సమంజసమైన సంఖ్య కాదని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ఒక్క డిఎస్సీ కూడా వేయలేదని తెలిపారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ఎప్పుడు ప్రకటిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. శాసనమండలిలో కూడా టిడిపి సభ్యుల ఆందోళన కొనసాగింది. టిడిపి సభ్యుల తీరుపై ఆగ్రహించిన మంత్రి బొత్స సత్యనారాయణ వారిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ ను కోరారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇక్కడకు వచ్చి గొడవ చేస్తే ఏమి లాభం అని ఆయన ప్రశ్నించారు. అధికార, విపక్షాల సభ్యులు పోటాపోటీ నినాదాలు చేశారు. సభ గందరగోళంగా ఉండటంతో చైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.










