ప్రజాశక్తి-విజయవాడ : మణిపూర్ మారణహోమానికి ప్రధాన దోషి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాగా, రెండవ దోషి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్, మూడవ ముద్దాయి దేశ హోం మంత్రి అమిత్‌షా అని... ఈ ముగ్గురు కూడా వారి వారి పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. మణిపూర్‌లో తక్షణం శాంతిని నెలకొల్పేందుకు అన్ని పక్షాలతో కలిపి ఒక శాంతి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 'మణిపూర్‌లో ఏమి జరుగుతుంది? 'కారణాలు-వాస్తవాలు' అనే అంశంపై విజయవాడలోని ఎంబివికె భవన్‌లో గురువారం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఒ. శాంతిశ్రీ అధ్యక్షత వహించారు. సదస్సునుద్దేశించి లక్ష్మణరావు మాట్లాడుతూ...గత మూడు మాసాల నుంచి అగ్నిగుండంలా మణిపూర్ మాడిపోతుండగా కేంద్రంలోని బిజెపి-మోడీ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తుందని, కనీసంగా ఈ అంశంపై పార్లమెంట్‌లో జరిగిన చర్చల్లో కూడా మణిపూర్ ఘటనపై ప్రధాని మాట్లాడకపోవడం ఆయన అహకారం, మతోన్మాద బిజెపి వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో శాంతి కోసం లౌకికవాదులు, ప్రజాస్వామిక వాదులు, అభ్యదయవాదులు అందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని అన్నారు. మణిపూర్ ఘటనలను లోతుగా పరిశీలిస్తే అక్కడి కొండల్లో, అడవుల్లో ఉన్న రూ. వేల కోట్ల ఖనిజ సంపదతో పాటు ఇతర సహజ వనరులు, భూములను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికి, కుకీతెగను నిర్మూలించాలని ఒక ప్లాన్ ప్రకారం మతోన్మాద బిజెపి ప్రభుత్వం చేయించిన దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను కాపాడటానికి సుప్రీంకోర్టు అక్కడి ఘటనలను సుమోటాగా తీసుకొని ముగ్గురు రిటైర్డ్ మహిళా జడ్జీలతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం, కేసుల దర్యాప్తుకు దత్తాత్రే అనే ఒక సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ ఏర్పాటు, అలాగే ఆరుగురు డిఐజి ర్యాంక్ ఆఫీసర్లను విచారణకు పంపించడం జరిగిందని తెలిపారు. మణిపూర్ ఘటనలు, బిజెపి మతోన్మాద వైఖరిపై సంఘం స్టీరింగ్ కమిటీ సభ్యులు తాజారావు, న్యాయవాది ఎస్‌కె మతిన్ మాట్లాడారు. తొలుత విజయవాడ సమాలోచన నిర్వాహుకులు విజరుప్రకాష్ ముఖ్యఅతిథులను వేదికపైకి ఆహ్వానించారు. నగరంలోని అభ్యదయవాదులు, మేధావులు, ఆయా రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు.










