Jul 17,2022 07:32
  • విడుదల కాని మార్గదర్శకాలు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలూ జారీ చేయలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టం అమలుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని కోరుతూ గతేడాది కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ కేసు విచారణ సమయంలో ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్య దశలో ఉందని, ఇప్పుడు మార్గదర్శకాలు జారీ చేయలేమని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని గతేడాది ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. కానీ, బడ్జెట్‌లో ఇందుకు ఎటువంటి నిధులూ కేటాయించలేదు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై పక్షం రోజులు అవుతున్నా ఇంతవరకు ఎటువంటి కదలికా లేదు. ఈ చట్టం ప్రకారం ఎంపిక చేసిన కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థలు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన విద్యార్థుల తరుఫున సంబంధిత పాఠశాలలకు ఫీజుల సొమ్మును ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేయాల్సి ఉంది. ఏయే కేటగిరి విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత విద్య అందించాలో నిర్దేశిస్తూ జారీ చేయాల్సిన మార్గదర్శ కాలపై ప్రభుత్వం ఇంతవరకూ దృష్టి సారించలేదు. ఇప్పటికే కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. 2010 ఏప్రిల్‌ పదిన యుపిఎ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం అమలులో ఉంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. చట్టం ఆమోదించి 12 ఏళ్లు గడచినా మన రాష్ట్రంలో ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు.

 

22



                                             వెంటనే మార్గదర్శకాలు ఇవ్వాలి ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు

విద్యా హక్కు చట్టం అమలుకు రాష్ట్రం ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో ఉందన్నారు. 25 శాతం ఉచిత సీట్లకు సంబంధించిన సొమ్మును అయా పాఠ శాలలకు రీయింబర్స్‌మెంట్‌ చేసేందుకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని కోరారు.