- సంస్కరణలతో పొంచి ఉన్న ముప్పు
- ఎఐఎస్‌ఎఫ్ సదస్సులో వక్తలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి)-2020 పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని సదస్సులో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌ఇపి పేరుతో తీసుకొస్తున్న సంస్కరణలతో విద్యకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 117తో పాఠశాల విద్య అస్తవ్యస్తం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'నేటి విద్యారంగం-సమస్యలు-పరిష్కార మార్గాలు' అనే అంశంపై విజయవాడలోని ఐఎంఎ హాల్‌లో ఎఐఎస్‌ఎఫ్ గురువారం సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్య కాషాయీకరణకు పూనుకుంటుందని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో విద్యా విధానానికి దశా, దిశ లేదని దేశవ్యాప్తంగా 20 మంది ప్రొఫెసర్ల బృందం సర్వే తేల్చిందన్నారు. నియామకాల్లో రాజకీయ జోక్యం, అకాడమిక్ వ్యవస్థకు అధికారాలు ఇవ్వకపోవడం వంటి వాటితో మొత్తం విద్యా వ్యవస్థ వృథాగా మారుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నత విద్యను విధ్వంసం చేసేలా, ఇంటర్ విద్యను కార్పొరేటీకరణగా, ప్రాథమిక రంగాన్ని విచ్ఛన్నం చేసే తరహాగా ఉన్నాయని విమర్శించారు. విద్యారంగ పరిరక్షణ కోసం యువజన, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాలని కోరారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. విద్యలో కేంద్రం పెత్తనం పెరిగేందుకు, విద్యను వ్యాపారం చేసేందుకు, విద్యలో కాషాయీకరణ జోడించేలా ఎన్‌ఇపి-2020 ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 5 వేల బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు యూనివర్సిటీలు ఎక్కువైతే సామాజిక న్యాయం, రిజర్వేషన్లు ఉండబోవని, ఫలితంగా పేదలకు విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల బడికి పేద పిల్లలు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. జిఓ 117 అమలైతే ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. స్వతంత్ర ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న దేశాలే ప్రపంచంలో అగ్రగామిగా నిలిచాయని తెలిపారు. విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాలతో సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. విద్యా పరిరక్షణ కన్వీనరు రమేశ్ పట్నాయక్ మాట్లాడుతూ.. విద్యను రాష్ట్రాల జాబితాలోనే ఉంచాలనే డిమాండ్‌తో వామపక్ష విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలతో కలిపి రాజకీయ ఉద్యమం నిర్మించాలని సూచించారు. తక్షణమే 30 వేల ఉపాధ్యాయ ఖాళీలకు డిఎస్‌సి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌టియు ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, పిడిఎస్‌యు సంఘాల అధ్యక్షులు రవిచంద్ర, ధనరాజ్, ఎఐఎస్‌ఎఫ్ అధ్యక్షులు జాన్సన్ బాబు మాట్లాడారు. 'ఐక్య ఉద్యమాల అవశ్యకత-విద్యార్థి, యువజనుల బాధ్యత' అంశంపై జరిగిన సదస్సులో ఎఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి జి ఈశ్వరయ్య, ఎఐవైఎఫ్ కార్యదర్శి ఎన్ లెనిన్‌బాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న తదితరులు ప్రసంగించారు.











