Jul 19,2021 09:13

ముంబయి : పిల్లల్ని రక్షించుకునేందుకు తల్లి ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతుంది. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ తన చిన్నారిని రక్షించేందుకు ఏకంగా పులిపైనే దాడి చేసింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు 8 కి.మీ. దూరంలోని జూనానా గ్రామంలో ఈ నెల ప్రారంభంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జునానా గ్రామానికి చెందిన అర్చన మేశ్రమ్‌ రోజువారీ కూలీ. ఆమె తన ఐదేళ్ల కుమార్తె ప్రాజెక్తను తీసుకుని బహిర్భూమికి వెళ్లింది. అదే సమయంలో చిరుత ప్రాజెక్తను ఈడ్చుకెళుతుండగా అర్చన కర్రతో వెంబడించింది. దీంతో చిరుత చిన్నారిని వదలి అర్చనపై దాడిచేసింది. ఆమె కర్రతో చిరుతపై తిరగబడడంతో అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అర్చనకు స్వల్ప గాయాలు కాగా, ప్రాజెక్తకు తీవ్రగాయాలైనట్లు చంద్రపూర్‌ జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు నాగ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రాజెక్త దవడ పైభాగంలో ఎముకలు విరిగాయని, ఎడమ కనురెప్ప కూడా మూతపడటంలేదని నిర్ధారించారు. సోమవారం శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.