ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల అధ్యాపకులకు నూతన విద్యా విధానంపై అవగాహనా సదస్సు మంగళవారం జరిగింది. మొగల్‌రాజపురంలోని పి.బి.సిద్ధార్థ కళాశాలలో జరిగిన సదస్సులో కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కె.రామమోహనరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదనకు అనుగుణంగా నూతన విద్యా విధానాన్ని అనుసరించి డిగ్రీ మూడు ప్రధాన సబ్జెక్టుల బదులు ఏకైక ప్రధాన సబ్జెక్టు ఉండేలా అన్ని కోర్సులలో పాఠ్య ప్రణాళిక మార్పులు జరిగాయని అన్నారు. నూతన మార్గదర్శకాలకి అనుగుణంగా అన్ని కళాశాలలు సమావేశాలు నిర్వహించుకుని తమ కోర్సులను మార్పులు చేసి విశ్వవిద్యాలయం అనుమతి పొందాలని సూచించారు. ఈ నూతన విధానం విద్యార్థి కేంద్రీకతమైందని తద్వారా విద్యార్థులు ఐచ్ఛికాంశాలు ఎంపిక చేసుకుని తమకు ఆసక్తిగల రంగంలో ఉపాధి అవకాశాలు పొందటానికి అవకాశం లభిస్తుందని వెల్లడించారు. అనంతరం కళాశాలకు సంబంధించిన ప్రాచార్యులు ఈ నూతన విధానంపై తమ సందేహాలను నివత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో కష్ణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామిరెడ్డి మాట్లాడుతూ విద్యా విధానంలో సంస్కరణల ద్వారా విద్యార్థులకు అధునాతన రంగాలలో ఉపాధి అవకాశాలు సాధించడానికి వెసులుబాటు కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కష్ణా విశ్వవిద్యాలయం కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కన్వీనర్, డీన్ డాక్టర్ రామశేఖర రెడ్డి, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డాక్టరు ఎం. రమేష్ బాబు పాల్గొన్నారు.










