క్యూబా మీద అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలకు ఆరు దశాబ్దాలు నిండాయి. 1991లో సోవియట్ రిపబ్లిక్‌లను కూల్చివేసిన తరువాత కూడా అవి కొనసాగుతున్నాయి. అక్కడి కమ్యూనిస్టు పార్టీ జనానికి కలిగించిన చైతన్యం కారణంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలిచింది. అనేక ఆటంకాల మధ్య తనదైన శైలిలో వైద్య రంగంలో అనేక విజయాలను క్యూబా నమోదు చేసింది. కోటీ 15 లక్షల జనాభా ఉన్న అక్కడ 90 వేలకు పైగా వైద్యులు ఉన్నారు. అక్టోబరు రెండవ తేదీ నాటికి 5,670 కేసులు నమోదు కాగా 122 మంది మరణించారు, 626 మంది చికిత్స పొందుతుండగా తొమ్మిది మంది విషమ స్ధితిలో ఉన్నారు. 1981లో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన సమయంలో నివారణకు తీసుకున్న చర్యల అనుభవం ఇప్పుడు కరోనా నివారణకు ఎంతగానో తోడ్పడింది.
అమెరికా లోని జార్జియా రాష్ట్ర జనాభా కూడా క్యూబాకు దగ్గరగా కోటీ ఐదు లక్షల మంది. అక్కడ అక్టోబరు రెండవ తేదీ నాటికి 3,19,334 కరోనా కేసులు నమోదు కాగా 7,063 మంది మరణించారు. 2,12,023 మంది చికిత్స పొందుతున్నారు. జనం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వానికి లేని పాలకులకు, సోషలిస్టు వ్యవస్థకు, పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న తేడా ఇది. తన జనాన్ని కాపాడుకోవటమే కాదు. 45 దేశాలకు అవసరమైన ఔషధాలను, వైద్యులను, సిబ్బందిని పంపింది. క్యూబా ఔషధంగా పేరుగాంచిన ఇంటర్‌ఫెరాన్ ఆల్ఫా 2బి తయారీ 2003 నుంచి చైనాలో జరుగు తోంది. అది కరోనా చికిత్సకు ఉపయోగపడు తోంది. జనాన్ని చంపటానికైనా సిద్ధపడుతున్నాడు గానీ దాన్ని అమెరికాలో వినియోగించటానికి డోనాల్డ్ ట్రంప్‌కు అహం అడ్డు వచ్చింది.
అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కోవిడ్ పరీక్షలన్నీ క్యూబా ప్రభుత్వం ఉచితంగానే చేసింది. వైద్యం అనేక దేశాల్లో బీమా కంపెనీల ఆదాయ వనరుగా, వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. క్యూబాలో 1960 దశకం నుంచి అభివృద్ధి చేసిన ప్రజారోగ్య వ్యవస్ధ జనాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని కూడా అందించగలు గుతోంది. అమెరికాలో ఒక రోజు ఆసుపత్రిలో ఉంటే 1,900 డాలర్లు ఖర్చయితే క్యూబాలో ఐదు డాలర్లు, హెర్నియా ఆపరేషన్‌కు 12 వేల డాలర్లు అయితే 14, తుంటి ఎముక ఆపరేషన్‌కు 14 వేలు అయితే క్యూబాలో 72 డాలర్లు మాత్రమే అవుతుంది. అమెరికాలో 2018లో తలకు 8,300 డాలర్లు ఖర్చు చేస్తే క్యూబాలో 400 డాలర్లు చేశారు. దీనికి అనుగుణంగానే అమెరికాలో వైద్యులకు ఇచ్చే వేతనాలు క్యూబాలో లేవు అన్నది కూడా నిజం. వైద్యులకు వేతనాల కంటే జనానికి వైద్య ఖర్చు తగ్గించటమే సోషలిస్టు క్యూబా ప్రత్యేకత. మిగతావారితో పాటు వైద్యులు కూడా ప్రభుత్వం నుంచి సామాజిక భద్రతను పొందుతారు.
క్యూబా వైద్య విధానాన్ని చూసి ప్రపంచం నేర్చుకోవాల్సి చాలా ఉంది. ప్రస్తుతం వెనెజులాలో 20 వేల మంది క్యూబన్ వైద్యులు, నర్సులు ఉన్నారు. స్ధానికులతో కలసి వారంతా ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు, చికిత్స, అవసరమైన సలహాలు అందించటం నిత్యకృత్యంగా చేస్తున్నారు. దేశంలో 15వేల క్లినిక్కులు, 572 రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలు, 586 చికిత్సా కేంద్రాలు, 35 ఉన్నత సాంకేతిక వైద్య కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిలో అత్యధిక భాగాన్ని కరోనా నిరోధ కేంద్రాలుగా పని చేయిస్తున్నారు. మూడు కోట్ల జనాభా ఉన్న వెనెజులాలో అక్టోబరు రెండవ తేదీ నాటికి 76 వేల కేసులు నమోదు కాగా 635 మంది మృత్యువాత పడ్డారు.పక్కనే ఉన్న కొలంబియాలో 8.35 లక్షల కేసులు, 26 వేల మరణాలు సంభవించాయి. వెనెజులా గురించి...అక్కడి జనం పడుతున్న ఇబ్బందుల గురించి...వున్నవీ లేనివీ చెప్పేవారు ఈ వివరాల గురించి ఏమంటారు? ఆమెరికా, ఇతర అనేక దేశాలు కల్పిస్తున్న ఇబ్బందులను తట్టుకుంటూ వెనెజులా జనాన్ని కరోనా బారిన పడకుండా కాపాడుతున్నది. అంతా సజావుగా ఉందని చెబుతున్న కొలంబియా సంగతి చూశాం. అదే ప్రాంతానికి చెందిన మరో దేశం బ్రెజిల్‌లో 48.5 లక్షల కేసులు నమోదు కాగా 1.44 లక్షల మంది మరణించారు. కట్టుకథలు చెప్పేవారు దీనికేమంటారు!?










