బ్యూనస్ ఎయిర్స్ : తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుండి క్యూబాను తొలగించాలని అర్జెంటీనా పార్టీలు కోరుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం పదవి నుండి వైదొలగుతూ తీసుకున్న ఈ చర్య పట్ల సర్వత్రా విమర్శలు, ఖండనలు వెల్లువెత్తాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఎఫ్‌డిటి సంకీర్ణంలోని పలు పార్టీలు కోరాయి. ఈ పరిస్థితుల్లో క్యూబన్లకు తమ సంపూర్ణ సంఘీభావం వుంటుందని ప్రకటించాయి. అర్జెంటీనా పాలక సంకీర్ణంలోని పలు పార్టీలు ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశాయి. క్యూబా తీవ్రవాద దేశం కాదని స్పష్టం చేశాయి. ట్రంప్ హయాం ముగిసినందున, ఎలాంటి ప్రాతిపదిక లేకుండా క్యూబాపై ఆయన తీసుకున్న చర్యలు ఇక చెల్లబోవని పేర్కొన్నాయి. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వెంటనే నష్టపరిహార చర్యలు తీసుకోవాలని కోరాయి. నిరంకుశంగా, ఏకపక్షంగా తీసుకున్న ఇటువంటి చర్యల వల్ల ప్రతి ఒక్క క్యూబన్ జీవితం, వారి హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆ ప్రకటన పేర్కొంది. ఆర్థిక ఆంక్షలు, వాణిజ్య అవరోధాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రశాంత జీవితం గడపలేకపోతున్నారని పేర్కొంది. ఇటువంటి చర్యలను ఫ్రెంటె గ్రాండె, ఫోర్జా పార్టీలు తీవ్రంగా ఖండించాయి.










