హవానా : క్యూబాలో కొత్త కుటుంబ చట్టాన్ని ఆధునీకరిస్తున్నారు. కుటుంబ హింసపై రాజ్యాంగ సూత్రాలను ప్రతిబింబించేలా ఈ మార్పులు వుండనున్నాయి. కుటుంబ హింస ఏ రూపంలో వున్నప్పటికీ వాటికి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి, అవసరమైన రక్షణ కల్పించడానికి ఈ కొత్త కోడ్‌లో చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబ వాతావరణంలో జరిగే హింసపై దృష్టి కేంద్రీకరించడానికి, నివారించడానికి అధిక ప్రాధాన్యతను క్యూబా రాజ్యాంగం ఇస్తోందని క్యూబన్ న్యాయ నిపుణుల జాతీయ సంఘం ఉపాధ్యక్షురాలైన డాక్టర్ యామిలా గోంజాలెజ్ ఫెర్రర్ పేర్కొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ హవానా లా స్కూల్‌లో ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్న ఆమె మాట్లాడుతూ, 2019 రాజ్యాంగంలో ఈ అంశానికి ప్రత్యక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కుటుంబాల్లో, లైంగిక హింసలో, బాలికలకు వ్యతిరేకంగా, బాలురకు వ్యతిరేకంగా, ఇలా పలు భిన్నమైన అధికరణల్లో ఈ విషయాలను ప్రస్తావించారని తెలిపారు. కుటుంబ హింస అనేది అందులోని వ్యక్తులను, మొత్తంగా కుటుంబాన్ని, సమాజాన్ని కూడా గాయపరిచేదిగా పరిగణించాలని సంబంధిత అధికరణ పేర్కొంటోంది. దీనివల్ల మూడు స్థాయిల్లో ప్రతికూల ప్రభావమే వుంటుందన్నది స్పష్టమని, కొన్నిసార్లు ఈ అంశాలు నిర్లక్ష్యానికి గురవుతాయన్నది కూడా వాస్తవమని పేర్కొన్నారు. భౌతిక దాడులు, హింస జరిగితేనే అది కుటుంబ హింస కిందకు వస్తుందని, అటువంటి సంఘటనలు కేవలం కింది స్థాయి కుటుంబాల్లోనే జరుగుతాయనే ఒక అపోహ చాలా సాధారణంగా అందరిలో వుంటుందని కానీ అది వాస్తవం కాదని ఆమె పేర్కొన్నారు. ఈ కుటుంబ హింస అనేది అనేక రకాలుగా వుంటుందని, శారీరకం,మానసికం, ఆర్థికంగా ఎలా ఎక్కడైనా ఎలా అయినా వుండొచ్చునని అన్నారు.










