Sep 13,2020 07:21


1936లో బెర్లిన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో నాలుగు బంగారు పతకాలు సాధించిన తొలి అమెరికన్‌ అథ్లెట్‌గా జెస్సీ ఓవెన్స్‌ రికార్డు సష్టించాడు. అయితే, పోడియం వద్దకు వచ్చి జర్మనీ అధినేత హిట్లర్‌ నుండి పతకాలను స్వీకరించడానికి తిరస్కరించాడు. ప్రపంచ క్రీడాభిమానుల సాక్షిగా ఓవెన్స్‌... హిట్లర్‌ జాత్యహంకారాన్ని ఛీత్కరించాడు. అదే స్ఫూర్తి నేడూ వ్యక్తమైంది. వర్ణ వివక్ష, జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఐదు రకాల క్రీడలకు చెందిన అథ్లెట్లు అంతా ఒక రోజు సమ్మె చేసి, తమ గళాన్ని ప్రపంచానికి వినిపించారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఒకవైపు కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. అయినా జాత్యహంకార మహమ్మారికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం నినదిస్తోంది. ఈ అథ్లెట్లు వారందరితోనూ కలిసి తమ నిరసనను ప్రదర్శించారు.
వర్ణ వివక్ష, జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రపంచ క్రీడారంగంలోని ఆటగాళ్లు వివిధ రూపాల్లో గళం విప్పుతూనే వున్నారు. అమెరికా యువ టెన్నిస్‌ సంచలనం కోకోగాఫ్‌ వీధుల్లోకి వచ్చి వివక్షకు వ్యతిరేకంగా ప్రసంగం చేయగా, బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైఖేల్‌ జోర్డాన్‌ రూ.760 కోట్ల నిధిని జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి విరాళంగా ప్రకటించాడు. తాజాగా అమెరికాలో ప్రొఫెషనల్‌ క్రీడాకారులు మునుపెన్నడూ, ఎవ్వరూ చేయని విధంగా సమ్మె చేశారు. జెస్సీ ఓవెన్స్‌ స్ఫూర్తిని తమ గుండెల నిండా నింపుకొన్న అమెరికన్‌ అథ్లెట్లు...డోనాల్డ్‌ ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్‌... వేలాది క్రీడాభిమానుల ముందు తల దించుకున్నట్లే, అథ్లెట్ల సమ్మెతో ట్రంప్‌ తెల్లమొహం వేయాల్సి వచ్చింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా సంఘటితమై, ఆటలను నిలిపివేసి, ప్రపంచవ్యాప్తంగా తమ స్వరాలను వినిపించారు.
ఐపీఎల్‌ లాంటి మ్యాచ్‌లలో అన్ని దేశాల వాళ్లు కలిసి ఒక జట్టుగా ఆడతారు. క్రిస్‌ గేల్స్‌ లాంటి విండీస్‌ క్రీడాకారులు ఆడినా, ఆస్వాదిస్తాం, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా క్రీడాకారులు ఆడినా ఆనందిస్తాం. క్రీడలకు జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ బేధాలుగానీ, ప్రాంతాల విభేదాలుగానీ వుండవు. అయితే, క్రీడలలోకీ మార్కెట్‌ ప్రవేశించింది. ఈ ఐపిఎల్‌ మ్యాచ్‌లలో ఆట గురించి ఓనమాలు కూడా తెలియని ఓ వ్యక్తి...ఒక క్రీడాకారుడి బ్రాండ్‌ ఇమేజ్‌ని వ్యాపారంగా మార్చుకుంటాడు. గెలుపు ఓటములనూ శాసిస్తాడు. ఇండియా- పాకిస్తాన్‌ క్రీడాకారుల ప్రదర్శన అంటే దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సుకత వుంటుంది. ఆటగాళ్ల ప్రదర్శనకు కితాబులూ వుంటాయి. అయితే, పాకిస్తాన్‌ ఆటగాళ్లకు మాత్రం మద్దతు ఇవ్వకూడదనే సంకుచిత తత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు పెంచి పోషిస్తున్నాయి. క్రీడా స్ఫూర్తికి దేశభక్తికి ముడిపెట్టి ఎదుటి దేశానికి మద్దతు ఇస్తే, దేశద్రోహులుగా ముద్ర వేస్తోంది. పర్యవసానంగా గత కొంతకాలంగా ఇండియాలో పాకిస్తాన్‌ క్రీడాకారుల ప్రదర్శనను చూసే అవకాశాన్ని కోల్పోయాం. మత విద్వేష, జాత్యహంకార రాజకీయాలను క్రీడా రంగంలోకి సైతం చొప్పించడం నిజమైన క్రీడా స్ఫూర్తి వున్నవారెవ్వరూ సహించరాని విషయం. జాత్యాహంకర మాటల తూటాలను ఎదుర్కొంటూనే వివక్షపై గొడవ పడుతూ కూడా ఆటకు నడుం కట్టారంటే... అది క్రీడా స్ఫూర్తి. కరోనా సమయంలోనూ ఐపిఎల్‌ ఆటకు సిద్ధమౌతున్నారంటే... అది క్రీడా స్ఫూర్తి. తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించే ఆటగాళ్ల ఔన్నత్యం ముందు... ఈ మాటల తూటాలు దూదిపింజలే. సరిహద్దులు చెరిపేసిన క్రీడా స్ఫూర్తిని, ఏ నియంతకూ తలవంచని ఆత్మవిశ్వాన్ని ప్రదర్శించగల జెస్సీ ఓవెన్స్‌ లాంటి క్రీడాకారుల అవసరం ఇప్పుడు ప్రపంచానికి, ముఖ్యంగా మన దేశానికి ఎంతైనా అవసరం.