ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ఎపిఎస్‌ఆర్టీసీలో విలీనం పేరుతో కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకుందామని ఎస్‌డబ్ల్యూఎఫ్ (స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్) కడప జోనల్ కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం పుట్టపర్తి లోని ఆర్టీసీ డిపోలో రాష్ట్ర కమిటీ ముద్రించిన ఆర్టీసీ ఉద్యోగులు, విలీనంతో కోల్పోయిన హక్కులు అనే పుస్తకాన్ని భాస్కర్‌తో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ తదితరులు ఉద్యోగ కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2020 జనవరిలో ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇందుకు ప్రత్యేకంగా చట్టం కూడా చేసిందన్నారు. విలీనం అయితే తమ బతుకులు బాగుపడతాయని, పని గంటలు తగ్గుతాయని, వేతనాలు పెరుగుతాయని, ఉద్యోగ భద్రత లభిస్తుందని ఉద్యోగులు భావించారన్నారు. విలీనం తర్వాత కార్మికుల బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందన్నారు. మెరుగైన ఆర్థిక పరిస్థితులు కల్పించడానికి, కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడానికి, ఉద్యోగ, కార్మిక సంఘాలన్నీ ఏకమై కోల్పోయిన హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ నాయకులు రియాజుల్లా, యాకుబ్ ఖాన్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.










