ప్రజాశక్తి-పరిగి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కులం పేరుతో దూషించడమే కాకుండా దళితుల వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించి మాట్లాడడం కలకలం రేపింది. మండలంలోని కోడిగినహళ్లి ఎపి ఆర్‌జెసి కళాశాలలో ఎస్సీ ఉపాధ్యాయులు, విద్యార్థులపై కళాశాలకు చెందిన సుజాత ఆసభ్య పదజాలంతో మాట్లాడడమే కాకుండా ఎస్సీ విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారని మాట్లాడినట్లు తోటి ఉపాధ్యాయురాలు సబితా రాణి ప్రిన్సిపల్ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ నిర్వహించిన ప్రిన్సిపల్ సుజాతపై శుక్రవారం ఎపి ఆర్‌జెసి సెప్రటరీ ఫిర్యాదు చేయడం గమనార్షం. విషయం తెలుసుకున్న దళిత సంఘం నాయకులు కళాశాలకు చేరుకుని కుల దూషణకు పాల్పడిన ఉపాధ్యాయురాలిపై విచారించి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ నరేంద్రకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ, ఎంఎస్‌ఎఫ్ రవి మాట్లాడుతూ సమాజం దినదినాభివృద్ధి చెందుతున్న సమయంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కులాలుగా విభజించి వ్యంగా మాట్లాడటం హేయమైన చర్య అని మండిపడ్డారు. తక్షణమే సుజాత, ఆమెకు సహకరించిన శివారెడ్డి, చెన్నకేశవులుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుల సంఘాల నాయకులు మద్దిలేటి, రమేష్, దళిత సమాఖ్య అధ్యక్షులు నారాయణ, మాజీ ఎంపిపి గోవిందప్ప, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆదర్శ్, తదితరులు ఉన్నారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న దళిత సంఘాల నాయకులు










