అవిశ్రాంత రైతాంగ పోరాట యోధుడు అమరజీవి కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా (ప్రస్తుతం ఏలూరు జిల్లా) దెందులూరు మండలం పోతునూరులో 1901లో జన్మించారు. గాంధీజీ పిలుపునందుకుని చదువుకు స్వస్తి చెప్పి 1919-21 సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం ద్వారా దేశ స్వాతంత్య్ర సమరంలోకి ఉరికారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రాజమండ్రి, నెల్లూరు జైళ్లలో ఒక ఏడాది కఠిన శిక్ష అనుభవించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1931లో పన్నులు పెంచుతూ రీసెటిల్‌మెంట్ పన్ను వేసింది. రీసెటిల్‌మెంట్‌కు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఉద్యమానికి దండు నారాయణరాజు, కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, ఉద్దరాజు రామం, మాగంటి బాపినీడు వంటి స్వాతంత్య్ర సమరయోధులు నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో కొమ్మారెడ్డి అరెస్టయి జైలుశిక్ష అనుభవించారు. 1934లో విశాఖలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర రైతు మహాసభలో రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.1937లో ఇచ్చాపురం నుండి తడ వరకు చారిత్రాత్మక రైతు రక్షణ యాత్ర నిర్వహించారు. రైతు రుణ విమోచన, జమీందారీ విధానం రద్దు వంటి ప్రధానమైన నినాదాలతో 130 రోజులపాటు ఈ పాదయాత్ర సాగింది. ఈ యాత్రకు కొమ్మారెడ్డితో పాటు చలసాని వాసుదేవరావు నాయకత్వం వహించారు. 2054 మైళ్ళు ప్రయాణించి 1938 మార్చి 27న మద్రాస్ కు చేరుకుంది. ఈ రైతు రక్షణ యాత్ర భారతదేశ రైతాంగం ఉద్యమంలో విశిష్టత కలిగినది. ఆ తర్వాత జరిగిన జమీందారి వ్యతిరేక పోరాటాలలో కొమ్మారెడ్డి ముందుండి స్ఫూర్తిదాయక పాత్ర నిర్వహించారు. తన ఇంట్లో ఉన్న అప్పుల ప్రామిసరీ నోట్లు తగులబెట్టి రైతుల్ని రుణ విముక్తుల్ని చేసి ఆదర్శంగా నిలిచారు. స్వాతంత్య్రోద్యమంలో అంతర్భాగంగా జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు. స్వాతంత్య్ర సాధనతో పాటు దేశంలో దారిద్య్రం, ఆర్థిక, సాంఘిక అసమానతలు పోయి సమసమాజం రావాలని భావించారు. సోషలిజం ఆశయాలకు ప్రభావితమై రైతులు, కార్మికుల ఐక్యత కోసం కృషి చేసిన ఆయన తన 39వ ఏట 1940 ఏప్రిల్ 19న మరణించారు. కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి జీవితం నేటి రైతాంగ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం.
- కె. శ్రీనివాస్,
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, సెల్ : 94900 98574










