నినాదాలుచేస్తున్న నాయకులు
విఆర్‌ఎలకు
కనీస వేతనంగా రూ.26 వేలు అందజేయాలి
-కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరు:గ్రామ రెవెన్యూ సహాయకులకు( విఆర్‌ఏ) కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, నామినేలుగా పని చేస్తున్న వారిని విఆర్‌ఏలుగా గుర్తించాలని, ఫేస్ యాప్ హాజరు, బయోమెట్రిక్ నుంచి మినహాయించాలని ఏపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాకార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట విఆర్‌ఏలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారిని కలిసి తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కె. పెంచల నరసయ్య మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మీ జీతాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానంటూ ఆర్భాటంగా హామీలు చేశారన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడున్నర సంవత్సరం పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో తాము చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. గతంలో పోరాడి సాధించుకున్న డి ఏ ను తిరిగి జమ చేయాలని జీవో ఇచ్చి, బలవంతంగా ఒక్కో విఆర్‌ఏ దగ్గర దాదాపు రూ.12 వేలు ప్రభుత్వం వసూలు చేసిందన్నారు. ఇప్పటి వరకు విఆర్‌ఏలకు అందజేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిందన్నారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్‌ఎలుగా గుర్తిస్తామని చెప్పి దాని ప్రస్తావనే తీసుకురావడం లేదు. దీనికి తోడు గ్రామస్థాయిలో భూ సర్వేలకు, అదే విధంగా గ్రామంలో అనేక ప్రాంతాలలో పనిచేసేటువంటి వీరిని సొంత మొబైల్ తీసుకుని ముఖ హాజరు వేసుకోవాలని చెప్పడం అన్యాయమన్నారు. విఆర్‌లుగా పనిచేస్తున్న వారిలో ఎక్కువ మందికి స్మార్ట్ ఫోను వాడటం తెలియదని, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్‌కు సిగెల్ సక్రమంగా ఉందని వీటన్నింటి దృష్ట్యా ముఖ హాజరు నుంచి విఆర్‌ఏలను మినహాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రస్తుత సిఎం పాదయాత్ర సందర్భంగా మాట తప్పును.. మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తి నేడు విఆర్‌ఏల పట్ల మాట మాట తప్పడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఏ) ల సమస్యలు పరిష్కరించి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో గౌస్ బాషా, నారయ్య, కోదండమ్, సీతమ్మ, రాములు, భాస్కర్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు .










