Jul 03,2021 06:54

    ళలు సమాజానికి ఆయువు పట్టు వంటివి. ఒక రకంగా సమాజాన్ని మేలుకొలిపేవి. 64 కళలలో దేని విశిష్టత దానిదే. ఎంతో మంది కళాకారులు చక్కటి సమాజ చైతన్యం కోసం ఆచరించే కళలు సందేశాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆలోచన రేకెత్తించేలా చక్కటి సందేశాన్ని కళా రూపకంగా తీర్చిదిద్దటం వారికే చెల్లు. కళాకారులు జాతిని మేలుకొలిపే సంస్కర్తలు. అయితే కళాకారుల జీవన విధానమే నేడు అగమ్యగోచరంగా తయారయ్యింది. వారికి రావాల్సిన పారితోషికం సకాలంలో అందడం లేదు. దాదాపు 16 నెలలకు పైగా వారికి ఉపాధి అవకాశాలు మృగ్యం. పైపెచ్చు కోవిడ్‌ లో వారి బతుకు ప్రశ్నార్ధకంగా మారింది. కళాకారులకు రావాల్సిన బకాయిలు పెండింగులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రెండు వేల కుటుంబాలు ఈ కళలనే నమ్ముకుని బతుకుతున్నాయి. కళాకారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బు సకాలంలో విడుదల కాక, రూ. 20 కోట్లకు పైగా బకాయి మరుగున పడి ఉంది. బిల్లులు విడుదల కావడం లేదు. బిల్లుల సంగతి దేవుడెరుగు! ప్రస్తుతం వారి పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక దయనీయంగా ఉంది. సమాజాన్ని మేలుకొలిపేవారు తమ జీవితాలలో మాత్రం వెలుగు లోకి చూడలేకపోతున్నారు. చీకట్లో మగ్గుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వం అడిగిన వెంటనే ఫలానా రూపకం, సామాజిక అంశం ప్రదర్శించి ప్రజలలో అవగాహన కల్పించడమే వారికి తెలుసు. ప్రజలలో అవగాహన కొరకు రాత్రి, పగలు కష్టపడి చక్కటి సందేశాత్మక ప్రదర్శన ఇస్తారు. సహజంగా ప్రభుత్వ రూపకం అంటే చాలా వరకు పారితోషికం ఖచ్చితత్వం అనే ఆశ. కానీ నెలలు గడుస్తున్నా వారికి రావాల్సిన బకాయిలు రాకుండా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందో అర్ధం కాని విషయం. ప్రతి వారికి అంతో ఇంతో సహాయ పడుతున్న ప్రభుత్వం కళాకారుల విషయంలో చిన్న చూపు చూడటం ఆశ్చర్యం.
     కాలికి గజ్జె కట్టి ఆడటం, డప్పు వాయిస్తూ పాడటం, మధుర కంఠంతో శ్రావ్యమైన, చైతన్యవంతమైన గీతాలు పాడటం కళాకారులకే సొంతం. అటువంటి కళాకారులకు తక్షణమే పారితోషికం చెల్లించాలి. ఎన్నో నెలల నుంచి కళ్ళు కాయలు కాచేలా, కాళ్ళు అరిగేలా ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగడం, నిరాశపడటం చూస్తుంటే వారి జీవనం ఎంత దయనీయంగా వుందో అర్ధం అవుతుంది. కళాకారుల వెతలు తొలగి రావాల్సిన డబ్బు సకాలంలో అందివ్వటంలో ప్రభుత్వం ముందుండాలి. మాములుగా ప్రదర్శన అయిన వారం రోజులకు రావాల్సిన పారితోషికం ఎక్కడా జాప్యం చేయకుండా వారికి అందాలి. కళాకారుల వెతలు తీరాలంటే వెంటనే బకాయిలు విడుదల చేయాలి. కళాకారుల ప్రదర్శన ముగియగానే పారితోషికం చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయమై స్పష్టమైన జీవో విడుదల కావాలి.
 

- కనుమ ఎల్లారెడ్డి