May 02,2023 22:56

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్సిటీ: కిడ్నీ మార్పిడి చికిత్సకు సంబంధించి తమ హాస్పిటల్‌పై జరగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని అరుణ్‌ కిడ్నీ సెంటర్‌ అధినేత, ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్‌ నలమాటి అమ్మన్న తెలిపారు. సూర్యారావుపేటలోని అరుణ్‌ కిడ్నీ సెంటర్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ హాస్పిటల్లో 2012లో నిర్వహించిన కిడ్నీ మార్పిడి చికిత్సను వివాదాస్పదం చేస్తూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో అసత్య కథనాలు ప్రసారమయ్యాయని చెప్పారు. తమ హాస్పిటల్లో నిర్వహించిన అన్ని చికిత్సల్లోనూ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ వచ్చామని, దాదాపు నాలుగు దశాబ్దాల తమ ప్రస్థానంలో ఏనాడూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. కిడ్నీ మార్పిడి విషయంలో తాము నిబంధనలను కచ్చితంగా పాటించామని, సదరు వ్యవహారంలో వాస్తవాలను ప్రతిఒక్కరికీ తెలియజేసేందుకే ఈ సమావేశం ఏర్పటుచేశామని డాక్టర్‌ అమ్మన్న పునరుద్ఘాటించారు.